బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కోసం వెల్లువలా దరఖాస్తులు: 6వేల పైనే, సీనియర్లు పోటీ చేయరా?
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి కలిగిన వారి నుంచి బీజేపీ తొలిసారి దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసింది. దరఖాస్తులకు చివరి గడువు ఆదివారంతో ముగియడంతో భారీగా సంఖ్యలో ఆశావాహులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. సెప్టెంబర్ 4 నుంచి 10 తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది బీజేపీ.
తొలి రోజు 63 మంది ఆశావాహులు 182 దరఖాస్తులు సమర్పించారు. రెండో రోజు 178, మూడో రోజు 306, నాలుగో రోజు 333, ఐదో రోజు 621, ఆరో రోజు 1603, చివరి రోజైనా ఏడో రోజు 3223 దరఖాస్తులు వచ్చాయి. దీంతో మొత్తం 6011 దరఖాస్తులు వచ్చినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే, చాలా మంది ముఖ్య నేతలు దరఖాస్తులు చేసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని పార్టీ అధిష్టానం చెప్పినప్పటికీ సీనియర్లు మాత్రం దరఖాస్తులు చేసుకోకపోవడం గమనార్హం. కాగా, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దరఖాస్తు చేసుకోలేదు. అమెరికా పర్యటనలో ఉండటంతో బండి సంజయ్ దరఖాస్తు చేసుకోలేకపోయారు.
తెలంగాణలో అధికారంలోకి రావాలంటే సీనియర్లంతా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని జాతీయ నాయకత్వం ఆదేశించినా.. వాటిని పట్టించుకోలేదు. పార్టీకి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు, గోషామహల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజా సింగ్‌పై బీజేపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
ఇక, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దరఖాస్తు చేసుకోలేదు. అయితే,
గజ్వేల్ నుంచి టికెట్ ఇవ్వాలని కోరుతూ ఈటల అభిమానులు శనివారం అప్లికేషన్ దాఖలు చేశారు. మరోవైపు, ఈటల సతీమణి జమున పేరిట కూడా గజ్వేల్ నుంచి పోటీకి అవకాశం ఇవ్వాలని దరఖాస్తు వచ్చింది. అయితే ఇవి తాము చేసిన అప్లికేషన్లు కావని.. తమ పేరిట అభిమానులు చేసి ఉంటారని ఈటల వర్గం చెబుతోంది.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సైతం దరఖాస్తు చేసుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ముఖ్య నేతల్లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, షాద్‌నగర్ నుంచి ఆయన తనయుడు మిథున్ రెడ్డి, గోషామహల్ నుంచి విక్రమ్ గౌడ్, ముషీరాబాద్ నుంచి బండారు విజయలక్ష్మి ఉన్నారు. ఇక దరఖాస్తు చేసుకున్నవారిలో ఎక్కువగా యువనేతలు, వారసులు ఉండటం గమనార్హం. త్వరలోనే అభ్యర్థులను ఎంపిక చేసి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications