కొండా సురేఖ బీజేపీలోకి ఎంట్రీపై తేల్చేసిన ఎంపీ డీకే అరుణ!
తెలంగాణ మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తొలగించిన అంశం తెలంగాణా పాలిటిక్స్ లో కాక రేపుతోంది.తాజాగా కొండ సురేఖ బర్తరఫ్ పై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో కొండా సురేఖ మాట్లాడుతూ ఆమె ఈ నిర్ణయాన్ని బాధాకరమైనదిగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు, వర్గ రాజకీయాలే కొండా సురేఖ బర్తరఫ్కు కారణమని ఆమె అభిప్రాయపడ్డారు.
వైఎస్సార్ మంత్రివర్గంలో తామిద్దరం కలిసి పని చేశామన్న డీకే అరుణ
కొండా సురేఖ సీనియర్ నాయకురాలని, 2009లో వైఎస్సార్ మంత్రివర్గంలో తామిద్దరం కలిసి పని చేశామని డీకే అరుణ గుర్తు చేశారు. ఒక మహిళా నాయకురాలు మంత్రి పదవిలో ఉండటం ఆనందకరమని, ఆమెను తొలగించడం నిజంగా బాధాకరమని తెలిపారు. రాజకీయాల్లో మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకోవడం పెద్ద విజయమని, అలాంటి వ్యక్తిని ఇలా తొలగించడం సమర్థనీయం కాదని ఆమె అన్నారు.

కూతురు చేసిన వ్యాఖ్యలకు తల్లిని బాధ్యురాలిని చేయటం కరెక్ట్ కాదు
కాంగ్రెస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ బీసీ వర్గాల కోసం చేసిన పనుల గురించి ఎన్నో చెప్తారని, అయితే కొండా సురేఖ కూడా బీసీ సమాజానికి చెందినవారేనని, అయినా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో చెప్పాలని డీకే అరుణ ప్రశ్నించారు. ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలకు తల్లిని బాధ్యురాలిని చేసి చర్యలు తీసుకోవడం సరైనది కాదని, ఇది న్యాయం కాదని స్పష్టం చేశారు.
కొండా సురేఖతో ఎలాంటి చర్చలు జరగలేదన్న డీకే అరుణ
రాజకీయాల్లో వర్గాలు, విభేదాలు సాధారణమని, కాంగ్రెస్లో ఇలాంటివి తరచూ కనిపిస్తాయని ఆమె వ్యాఖ్యానించారు. అయితే కొండా సురేఖను బీజేపీలోకి తీసుకునే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదని డీకే అరుణ స్పష్టం చేశారు. ఆమె భవిష్యత్ రాజకీయాలపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఆమె తేల్చి చెప్పారు. కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత తాను ఎమ్మెల్యేగా కొనసాగుతానని చెప్పిన నేపథ్యంలో డీకే అరుణ ఇలా స్పందించారు.
బీజేపీ నేతల సానుభూతి.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి
మొత్తంగా ఈ నిర్ణయం కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తోందని, మహిళా నాయకురాలిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైనది కాదని డీకే అరుణ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో అనుభవం ఉన్న సీనియర్ నాయకురాలిపై ఇలాంటి నిర్ణయం బాధాకరమని డీకే అరుణ చెప్పటం, కొందరు బీజేపీ నేతలు కొండా సురేఖ పట్ల సానుభూతి వ్యక్తం చేయటం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.













Click it and Unblock the Notifications