గ్రేట్.. చెంచుల కోసం శ్రీశైలం ఆలయంలో ప్రత్యేకంగా
ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రావణ మాస మహోత్సవాల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఈ పవిత్ర కాలంలో శ్రీశైల దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహించింది. శుక్రవారం చంద్రావతి కల్యాణ మండపంలో జరిగిన ఈ విశిష్ట పూజా కార్యక్రమంలో సుమారు 1,700 మందికి పైగా భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య వరలక్ష్మీ వ్రత పూజా విధానం అత్యంత శాస్త్రోక్తంగా కొనసాగింది.
నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని నల్లమల అటవీ ప్రాంతాలు, గిరిజన తండాల్లో నివసించే చెంచు మహిళల కోసం శ్రీశైలం దేవస్థానం ప్రత్యేకంగా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయా గ్రామాలు, గూడేల నుంచి తరలివచ్చిన దాదాపు 1,233 మందికి పైగా చెంచు గిరిజన మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్నారు. వారికి అన్ని రకాల వసతులను పూర్తిగా ఉచితంగా కల్పించారు.

ఈ సామూహిక వ్రతాచరణకు అవసరమైన పూజా సామాగ్రి మొత్తాన్ని దేవస్థానమే భరించింది. పసుపు, కుంకుమ, పూజా ద్రవ్యాలు, తోరణాలు, ప్రత్యేక కలశాలను ఆలయ అధికారులు అక్కడ స్వయంగా ఏర్పాటు చేశారు. గిరిజన గూడాల నుంచి వచ్చిన చెంచు మహిళల కోసం ప్రత్యేక రవాణా వసతిని సైతం కల్పించారు. అర్చకులు మొదట విఘ్నేశ్వరుడి అనుగ్రహాన్ని కాంక్షిస్తూ మహాగణపతి పూజతో కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు అర్చకులు.
అనంతరం ప్రత్యేక పీఠంపై కొలువుదీరిన శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబికా దేవి ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్త పద్ధతిలో షోడశోపచార పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న ముత్తయిదువులు అందరూ శ్రద్ధతో వరలక్ష్మీ దేవి అష్టోత్తర శతనామ పూజను నిర్వహిస్తూ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
అనంతరం వ్రతంలో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రసాదం, పసుపు, కుంకుమ, పూలు, గాజులను పంపిణీ చేశారు. తులసి మొక్కలను అందజేశారు. ఆలయ మాసపత్రిక శ్రీశైలప్రభ, స్వామివారి పవిత్ర శేషవస్త్రాలను కానుకగా అందించారు. పూజ ముగిసిన తర్వాత చెంచు మహిళలు, ఇతర భక్తులకు ఉచితంగా ప్రత్యేకంగా మల్లికార్జున స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. గిరిజన ప్రాంతాల్లో హిందూ ధర్మాన్ని వ్యాపింపచేయడానికి శ్రీశైల దేవస్థానం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈఓ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.













Click it and Unblock the Notifications