సంచలనానికి తెర తీసిన ఐరాస- నూతన వరల్డ్ మ్యాప్: మెర్కెటర్ కు కాలం చెల్లు: ఇకపై..
ఐక్యరాజ్యసమితి సంచలనానికి తెర తీసింది. ఇప్పుడు చలామణి ఉంటూ వస్తోన్న వరల్డ్ మ్యాప్ ను సమూలంగా మార్చే దిశగా ఓ చారిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించింది. మనం దశాబ్దాలుగా చూస్తోన్న మెర్కేటర్ వరల్డ్ మ్యాప్ స్థానంలో ఈ నూతన చిత్రపటం అందుబాటులోకి రానుంది. ప్రస్తుత మ్యాప్ లో ఉన్న ఖండాలు, భూభాగాల అసలు పరిమాణాన్ని స్పష్టంగా చూపించే కొత్త పటాన్ని ప్రవేశపెట్టాలని ఐరాస నిర్ణయించింది.
ఈ నూతన మార్పు వల్ల ఇకపై ప్రపంచ పటంలో ఆఫ్రికా ఖండం చాలా పెద్దది కనిపించబోతోంది. ఐరోపా, ఉత్తర అమెరికా ఖండాలు వాటి వాస్తవ రూపం కంటే చిన్నవిగా దర్శనం ఇవ్వనున్నాయి. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా టోగో.. ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది. దీనిపై నిర్వహించిన ఓటింగ్ లో ఐరాస సభ్య దేశాలన్నీ కూడా పాల్గొన్నాయి. తమ అభిప్రాయాలను ఓటింగ్ ద్వారా తెలియజేశాయి.

ఈ తీర్మానానికి అనుకూలంగా 164 దేశాలు ఓటు వేశాయి. అమెరికా మాత్రం ఈ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించింది. దీనికి వ్యతిరేకంగా ఓటు వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సవాళ్లు తలెత్తుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి ఇలాంటి అనవసరమైన అంశాలపై దృష్టి పెట్టడం సరికాదని అమెరికా మండిపడింది. మరో ఆరు దేశాలు ఈ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉన్నాయి. తటస్థ వైఖరిని ప్రదర్శించాయి.
ప్రస్తుతం పాఠశాలలు, కార్యాలయాలు, గూగుల్ మ్యాప్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మనం చూస్తున్న ప్రపంచ పటాన్ని 1569లో గెరార్డస్ మెర్కేటర్ అనే కార్టోగ్రాఫర్ రూపొందించారు. అప్పట్లో సముద్ర ప్రయాణాలు చేసే నావికులకు సరైన దిశలను చూపించడానికి ఈ మ్యాప్ ఎంతగానో ఉపయోగపడింది. గుండ్రంగా ఉండే భూమిని సమతలంగా ఉండే కాగితంపై చూపించే క్రమంలో ఈ మ్యాప్‌లో ధృవ ప్రాంతాల వైపు ఉన్న దేశాల పరిమాణాలు వాటి అసలు స్వరూపానికి, భౌగోళిక వాస్తవికతకు విరుద్ధంగా చాలా పెద్దవిగా మారిపోయాయి.
దీనికి ఉదాహరణ.. గ్రీన్‌లాండ్, ఆఫ్రికా ఖండం పరిణామాలు. మెర్కేటర్ మ్యాప్‌లో చూస్తే ఇవి రెండూ దాదాపు ఒకే పరిమాణంలో ఉన్నట్లు కనిపిస్తాయి గానీ వాస్తవానికి ఆఫ్రికా ఖండం వైశాల్యం పరంగా గ్రీన్‌లాండ్ కంటే దాదాపు 14 రెట్లు పెద్దది. ఈ పాత విధానం వల్ల ఐరోపా, ఉత్తర అమెరికా, రష్యా వంటి ప్రాంతాలు చాలా పెద్దవిగా ప్రాధాన్యతను సంతరించుకోగా, భూమధ్యరేఖకు సమీపంలో ఉండే ఆఫ్రికా, దక్షిణ ఆసియా, దక్షిణ అమెరికా దేశాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి.
ఈ భౌగోళిక అసమానతలను సరిదిద్దడానికి 2018 సంవత్సరంలో నిపుణులు ఈక్వల్ ఎర్త్ (Equal Earth) అనే సరికొత్త ప్రొజెక్షన్‌ను డెవలప్ చేశారు. ఖండాల సరిహద్దులు, వాటి ఆకారాలు దెబ్బతినకుండా వాటి అసలైన వైశాల్యాన్ని కచ్చితమైన నిష్పత్తిలో ప్రదర్శిస్తారీ విధానంలో. ఈ మ్యాప్ అందుబాటులోకి రావడం వల్ల భారత్ సహా దక్షిణ ఆసియా దేశాలు, లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల యథార్థ రూపాలు ప్రపంచానికి స్పష్టంగా కనిపిస్తాయి.
భౌగోళిక విస్తీర్ణాన్ని సమతుల్యంగా చూపించడం వల్ల విద్యార్థులకు ప్రపంచ దేశాల వైశాల్యంపై నిజమైన అవగాహన ఏర్పడుతుందని ఆఫ్రికా దేశాల ప్రతినిధులు స్పష్టం చేస్తోన్నారు. వలసవాద కాలం నాటి పాత దృక్పథాన్ని దూరం చేసి, అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడమే ఈ మార్పు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని చెబుతున్నారు. మ్యాప్ అంటే రేఖలు మాత్రమే కావని, అవి భౌగోళిక ఆలోచనలను శాసిస్తాయని టోగో విదేశాంగ మంత్రి రాబర్ట్ డస్సీ వ్యాఖ్యానించారు.
దీనిపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఐరాసలో అమెరికా ప్రతినిధి యరినా ఫెరెంసెవిచ్ దీన్ని తప్పుపట్టారు. 16వ శతాబ్దానికి చెందిన ఓ మ్యాప్ గురించి చర్చించడం వల్ల సమయం వృథా అవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. మానవాళి ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలను వదిలేసి, ఇలాంటి సైద్ధాంతిక వివాదాలపై దృష్టి సారించడం వల్లే ఐక్యరాజ్యసమితి క్రమంగా తన విశ్వసనీయతను కోల్పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా ఈ ఏడాది చివరి నాటికి తమ దేశ పాఠశాలల్లోని భూగోళశాస్త్ర పాఠ్యపుస్తకాలలో పాత మ్యాప్ స్థానంలో ఈక్వల్ ఎర్త్ మ్యాప్‌ను ప్రవేశపెట్టాలని టోగో నిర్ణయించింది కూడా. ఈ ప్రతిపాదనకు కోస్పాన్సర్‌గా ఉన్న ఫ్రాన్స్ కూడా మెర్కేటర్ మ్యాప్‌లను క్రమంగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఈ నూతన ఈక్వల్ ఎర్త్ మ్యాప్‌ను ఉపయోగించాలని ఐక్యరాజ్యసమితి బలవంతం చేయదు గానీ.. వాస్తవికతను ప్రతిబింబించే ఈ మ్యాప్‌ను వినియోగించేలా ప్రోత్సహించాలని సభ్యదేశాలను సూచించింది.












Click it and Unblock the Notifications