పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ ఎంపీ సోయం బాపూరావు: ఇదీ అసలు విషయం!
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపూరావు(Soyam Bapurao) పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్వయంగా ఆయనే స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై ఆయన మండిపడ్డారు. అర్థంలేని ఆరోపణలు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తాను బీజేపీలోే కొనసాగుతానని స్పష్టం చేశారు.
'ఈ నెల 27న నా కుమారుడి పెళ్లి ఉంది. పెళ్లి కార్డులు అన్ని పార్టీల వారికీ ఇస్తాం. పార్టీలకు అతీతంగా నేతలందర్నీ పిలుస్తున్నాను. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా పెళ్లి పత్రిక ఇస్తాను' అని సోయం బాపూరావు తెలిపారు. కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీజేపీలోకి గతంలో తానే ఆహ్వానించానని.. ఆయనతో తనకు ఎలాంటి విభేదాలు లేవని బాపూరావు స్పష్టం చేశారు.

తనపై వస్తున్న తప్పుడు ప్రచారంవెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని బాపూరావు ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేస్తే లీగల్‌గా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన దేశమంతా గెలిచినట్లు కాదన్నారు. అక్కడ బీజేపీ పరాజయం పాలైనప్పటికీ.. ఓట్ల శాతం మాత్రం తగ్గలేదని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వివరించారు.
కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసిన సోయం బాపూరావు మొదటిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీకి కీలక నేతగా ఉన్నారు. బీజేపీలో పలువురు నేతల చేరికలో కూడా ఆయన ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. బీజేపీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పార్లీ మార్పుపై ప్రచారం జరుగుతుండటంతో సోయం బాపూరావు ఆ ప్రచారాన్ని ఖండించారు.












Click it and Unblock the Notifications