బండి సంజయ్ పాదయాత్ర-ప్రారంభించనున్న నడ్డా-తొలి విడతలో ఎక్కడి నుంచి ఎక్కడికంటే..
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అగస్టు 9వ తేదీ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభం కానున్న యాత్ర.. మొత్తం నాలుగు విడతల్లో కొనసాగనుంది.మొదటి విడతలో హైదరాబాద్ నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సంజయ్ ఈ యాత్రను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఇదే అంశంపై సోమవారం(జులై 12) బండి సంజయ్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు.
ఒకవేళ జేపీ నడ్డా హాజరుకాలేకపోతే మరో జాతీయ నేత లేదా కేంద్రమంత్రి ఈ యాత్రను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ పాదయాత్ర కోసం మొత్తం 20 కమిటీలను ఏర్పాటు చేయాలని తాజా సమావేశంలో తీర్మాంచినట్లు తెలుస్తోంది. పాదయాత్ర అంశంపై మంగళవారం(జులై 13) కూడా పార్టీ ముఖ్య నేతలతో బండి సంజయ్ చర్చించనున్నారు.

రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడం,2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. ఇందులో భాగంగా మొదట హుజురాబాద్ ఉపఎన్నికను ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే మొదటి విడతలో హైదరాబాద్ నుంచి హుజురాబాద్‌కు పాదయాత్ర చేయనున్నారు. హుజురాబాద్‌లో పార్టీని గెలిపించడం ద్వారా టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అన్న విషయాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
బండి సంజయ్ గతేడాది బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. దుబ్బాక ఉపఎన్నికలో గెలుపుతో ఆయన సారథ్యంపై అంచనాలు మరింతగా పెరిగాయి. అందుకు తగ్గట్లే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీని గెలిపించడంలో సంజయ్ కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు,నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఓడిపోయినప్పటికీ.. భవిష్యత్తులో పార్టీని గెలిపించేందుకు కొత్త వ్యూహాలతో సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో పాదయాత్రను ఆయన ప్రధాన అస్త్రంగా మలుచుకోనున్నారు. పాదయాత్రతో జనంలోకి వెళ్లి ప్రజాసమస్యలపై గొంతెత్తనున్నారు. తద్వారా ప్రజలకు పార్టీని మరింత చేరవ చేయనున్నారు. అటు కాంగ్రెస్ సారథి రేవంత్ రెడ్డితో పాటు కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల సైతం త్వరలోనే పాదయాత్రలకు శ్రీకారం చుట్టబోతున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో పాదయాత్రల సీజన్ హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications