తెలంగాణపై ప్రధాని - షా ఫోకస్ : హైదరాబాద్ లో మకాం - జాతీయ నేతలంతా ఇక్కడికే..!!
తెలంగాణ పైన బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. జాతీయ రాజకీయాల పైన కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తుండటం.. ప్రధాని - బీజేపీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ సైతం కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది. ఇందు కోసం రానున్న రోజుల్లో అగ్ర నేతలు తెలంగాణలో మకాం వేయనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ - కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పదునైన విమర్శలు చేసారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారం అంటూ ధీమా వ్యక్తం చేసారు.

తెలంగాణ పైన బీజేపీ స్పెషల్ ఫోకస్
తెలంగాణ ప్రభుత్వం అవినీతిమయం అయిందంటూ ఆరోపించారు. గతం కంటే బీజేపీ బలం పెరిగిందనే నమ్మకంతో ఉన్న అగ్రనేతలు ఇక, మరింత కార్యక్రమాలను ముమ్మరం చేయాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా.. బీజేపీ జాతీయ కార్యవర్గాలను సైతం హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించాలని దాదాపుగా నిర్ణయించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై కసరత్తును ప్రారంభించింది. హైదరాబాద్ లో ఎక్కడ ఈ సమావేశాలకు అనువుగా ఉంటుందనే అంశం పైన పార్టీ కీలక నేతలు బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.ఎల్. సంతోష్ ..పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ హెచ్ఐసీసీని సందర్శించారు. అక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు వీలుగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చారు.

హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ ముఖ్య నేతలు
మూడు రోజల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో పాటుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు. పార్టీ యాక్టివిటీ హైదరాబాద్ కేంద్రంగా పెరగటం ద్వారా స్థానికంగా పార్టీ నేతల్లో - కేడర్ లో కొత్త జోష్ వస్తుందని అంచనా వేస్తున్నారు. గతంలో..ఇంద్రసేనారెడ్డి బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హైదరాబాద్ కేంద్రంగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. తిరిగి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ హయాంలో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి.

హీటెక్కుతున్న తెలంగాణ రాజకీయం
ఈ మూడు రోజుల సమావేశంలో హైదరాబాద్ తీర్మానం పేరుతో రాజకీయంగా కీలక అంశాలపైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ మూడు రోజుల్లోనూ జాతీయ రాజకీయాలతో పాటుగా తెలంగాణ రాజకీయాల పైన పార్టీ ముఖ్య నేతలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టనున్నారు. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రణాళికా బద్దంగా వ్యవహరిస్తే తెలంగాణలో అధికారం కష్టం కాదనే అభిప్రాయం కమలం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. అదే సమయంలో సీఎం కేసీఆర్ తెలంగాణలో హ్యాట్రిక్ కొడతామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఈ సమావేశాల ద్వారా తెలంగాణలో రాజకీయం మరింత హీటెక్కటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications