జెయింట్ కిల్లర్ ఆ కామా"రెడ్డి" ఎవరు - వైసీపీలో నాడు, గుగూల్ లో భారీ సెర్చింగ్..!!
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఇప్పుడు వెంటక రమణారెడ్డి సంచలనంగా మారారు. ప్రస్తుత సీఎం..కాబోయే సీఎంను ఓడించి ట్రెండ్ సెట్టర్ గా మారారు. ఇద్దరినీ ఒకేసారి ఓడించి జెయింటి కిల్లర్ గా మారిన ఆ బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. కామారెడ్డి నుంచి తొలి సారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఇంతకీ ఎవరీ వెంకటరమణా రెడ్డి. నెటిజెన్లు గుగూల్ లో భారీ స్థాయిలో సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరీ వెంకట రమణా రెడ్డి. ఎలా గెలిచారు.
సంచలన విజయం
కాటిపల్లి వెంకటరమణారెడ్డి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితం తర్వాత రాజకీయ వర్గాల్లో మార్మోగుతున్న పేరు. నిన్నటిదాకా కామారెడ్డి జిల్లా నేతగానే ఉన్న వెంకటరమణారెడ్డి ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా సంచలనం అయిపోయారు. తెలంగాణ సీఎం కేసీఆర్, సీఎం అభ్యర్థి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యర్థులుగా పోటీ పడిన కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి విజయం సాధించడమే ఇందుకు కారణం.

బీజేపీ అభ్యర్థి అయిన వెంకటరమణా రెడ్డి తన సమీప అభ్యర్థి కేసీఆర్‌పై 6,741 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 66,652 ఓట్లతో కాటిపల్లి విజయం సాధించగా.. కేసీఆర్ 59,911 ఓట్లు, రేవంత్‌రెడ్డి 54,916 ఓట్లుతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచి ఓడిపోయారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ 1257 ఓట్లు బీజేపీకే వచ్చాయి.
జెయింట్ కిల్లర్ గా నిలిచి
ఓట్ల లెక్కింపులో పదో రౌండ్ వరకు రేవంత్ ఆధిక్యం కొనసాగినా... 11వ రౌండ్ నుంచి కాంగ్రెస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరిగింది. కానీ, ఆఖరి, 19వ రౌండ్ వరకు బీజేపీ ఆధిక్యం కొనసాగింది. కేసీఆర్, రేవంత్‌కు కాకుండా ఓటర్లు స్థానికుడైన కాటిపల్లికి పట్టం కట్టిన ఓటర్లు సంచలన తీర్పు ఇచ్చారు. 2018 ఎన్నికల్లో కామారెడ్డి నుంచే బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెంకటరమణారెడ్డికి 15,439 ఓట్లే వచ్చాయి.
కేసీఆర్, రేవంత్ ఎవరు గెలిచినా నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని ప్రజలకు తెలుసు. ఇదే అంశాన్ని కాటిపల్లి ప్రజల్లోకి తీసుకెళ్లారు. తానైతే లోకల్ అని ప్రజలకు వివరించారు. దీనికి తోడు ప్రధాని మోదీ బహిరంగ సభ కూడా ఉపయోగపడింది. రైతుల సమస్యలు, డ్వాక్రా మహిళల రుణాల మంజూరు, అధికార పక్షనేతల భూ కబ్జాలపై కాటిపల్లి పోరాటాలు చేశారు. వీటితో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు.

కలిసొచ్చిన పోరు
తాను గెలిచినా, లేకున్నా రూ.150 కోట్ల సొంత నిధులతో పలు అభివృద్ధి పనులు చేస్తానని కాటిపల్లి సొంత మేనిఫెస్టోను ప్రకటించారు. అన్ని మండల కేంద్రాల్లో మల్టీసూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కట్టిస్తానని, మోడల్ స్కూళ్లు నిర్మిస్తానని, రైతు సేవ కేంద్రాలు, యువతకు ఉపాధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇవన్నీ కలిసి కాటిపల్లికి సంచలన విజయానికి కారణమయ్యాయి.
కాటిపల్లి వెంకటరమణారెడ్డి విద్యా సంస్థల నిర్వహణతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ ఉన్నారు.2006లో కాంగ్రెస్ తరఫున తాడ్వాయి జడ్పీటీసీగా గెలుపొందారు. అప్పటి సీఎం వైఎస్ అండతో 2008-11 వరకు ఉమ్మడి నిజామాబాద్ జడ్పీ చైర్మన్‌గా చేశారు. వైఎస్ మరణం అనంతరం వైసీపీలో చేరి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేశారు. తిరిగి కాంగ్రెస్ లో చేరి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉండి చివర్లో తప్పుకున్నారు. ఆ తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు జెయింట్ కిల్లర్‌గా నిలిచారు.












Click it and Unblock the Notifications