బీఆర్ఎస్ పార్టీకి బోథ్ ఎమ్మెల్యే బాపూరావు గుడ్‌బై, ఆ పార్టీలోకేనా?
హైదరాబాద్: త్వరలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలు మారే నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా, అధికార పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పటికే మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కూడా అధికార బీఆర్ఎస్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు, అనుచరులతో బాపూరావు సమాలోచనలు జరిపారు. తాను ఎమ్మెల్యేగా ఎలాంటి తప్పు చేయలేదని.. పార్టీకి నష్టం చేయలేదని బాపూరావు అన్నారు. కొంతమంది చెప్పుడు మాటలు విని తనకు టికెట్ ఇవ్వలేదని అన్నారు.

మరో నాలుగు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని బోథ్ ఎమ్మెల్యే బాపూరావు ప్రకటించారు. అయితే, తాను ఏ పార్టీలో చేరుతున్నట్లు ఆయన చెప్పలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీలోనే ఆయన చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కాగా, సీటు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న బాపూరావు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అపాయింట్‌మెంట్ కోరారు. దీనిపై కేటీఆర్ నుంచి స్పందన రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీనీ వీడాలని రాథోడ్ నిర్ణయం తీసుకున్నారు. బోథ నుంచి బీఆర్ఎస్ నుంచి బరిలోకి దింపేందుకు కేసీఆర్.. నేరడిగొండ జడ్పీటీసీ సభ్యుడు అనిల్ జాదవ్‌కు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే అధికార బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు బాపూరావు దూరం ఉంటూ వస్తున్నారు. పార్టీ మారాలంటూ తన మద్దతుదారులు చేస్తున్న ఒత్తిడితోనే బాపూరావు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, బీఆర్ెస్ టికెట్ దక్కని మరికొందరు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, రేఖా నాయక్ లాంటి నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications