ఏపీలో బీఆర్ఎస్ నేతల లిస్టు రెడీ : కడప జిల్లా నేతతో సహా ఆ ఇద్దరూ..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ కు ఏపీలో నేతల వేట మొదలైంది. ఇప్పటికే కేసీఆర్ యాక్షన్ టీం రంగంలోకి దిగింది. పార్టీ ప్రకటనకు ముందే ఏపీకి చెందిన కొందరు నేతలు - మేధావుల తో సీఎం కేసీఆర్ మంతనాలు సాగించారు. బీజేపీ వ్యతిరేక పోరాటానికి తనతో కలిసి వచ్చేదెవరో ముందే ఎంపిక చేసుకున్నారు. జాతీయ పార్టీగా గుర్తింపు దక్కాలంటే సాధించాల్సిన ఓట్లు - సీట్లు లక్ష్యంగా ఏపీలో అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా.. ఏపీకి చెందిన నేతల లిస్టు సిద్దం అయింది.

ఏపీలో బీఆర్ఎస్ కోర్ టీం..
ఏపీలో నేతల ఎంపిక బాధ్యతను కేసీఆర్ తన కోర్ టీంకు అప్పగించారు. రాష్ట్ర విభజన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఏపీలో పార్టీ విస్తరణ అంత సులువు కాదని కేసీఆర్ కు తెలిసిన అంశమే. దీంతో..బీజేపీ వ్యతిరేకత- ఏపీకి ప్రత్యేక హోదా- హామీలు అమలు చేయకపోవటం ప్రధాన అస్త్రాలుగా కొందరు ప్రముఖులను దగ్గర చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా.. టీడీపీ - వైసీపీ కి దూరంగా ఉంటున్న సీనియర్ నేతల పైన కేసీఆర్ ఫోకస్ పెట్టారు. వారితో సంప్రదింపుల బాధ్యతలను తన విధేయులకు అప్పగించారు. అందులో భాగంగా.. విశాఖ జిల్లా నుంచి ఇద్దరు ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ కొణతాల రామక్రిష్ణ..దాడి వీరభద్రరావు లతో కేసీఆర్ టీం మంతనాలు చేసిందని ప్రచారం సాగుతోంది.

సీమ-ఉత్తరాంధ్రపై ఫోకస్
కొణతాల మాజీ ఎంపీ. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పని చేసారు. 2014లో విశాఖ నుంచి విజయమ్మ కు మద్దతుగా ప్రచారం చేసారు. ఆ తరువాత వైసీపీకి దూరమయ్యారు. ఉత్తరాంధ్ర హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. దాడి వీరభద్రరావు టీడీపీలో కీలక నేతగా పని చేసారు. వైసీపీలోనూ జగన్ తో కలిసి అడుగులు వేసారు. ఆయన కుమరుడికి 2014 ఎన్నికల్లో విశాఖ పశ్చిమం నుంచి వైసీపీ టికెట్ కేటాయించారు. ఇప్పుడు ఇద్దరి నేతలతో చర్చలు జరుగుతున్నట్లు విశాఖ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. ఇక, సీఎం జగన్ సొంత జిల్లాకు చెందిన సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి తోనూ బీఆర్ఎస్ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. ఆయన 2019 ఎన్నికల సమయంలో వైసీపీ కండువా కప్పుకొని వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసారు.

సంక్రాంతికి పూర్తి ప్లాన్ తో ఏపీలోకి
కానీ, కొంత కాలంగా డీఎల్ వైఖరి మారింది. సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. త్వరలోనే తాను కొత్త పార్టీలో చేరుతానని, ఆ పార్టీ టికెట్ పైన పోటీ చేస్తానని కొద్ది రోజుల క్రితమే డీఎల్ ప్రకటించారు. ఇప్పుడు డీఎల్ సీనియార్టీని రాయలసీమలో వినియోగించుకోవాలని బీఆర్ఎస్ నేతల ఆలోచనగా తెలుస్తోంది. దీంతో పాటుగా.. గోదావరి జిల్లాల్లోని టీడీపీ -వైసీపీ అసంతృప్త నేతలపైన బీఆర్ఎస్ గురి పెట్టినట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి వేళ విజయవాడ వేదికగా బహిరంగ సభ ద్వారా ఏపీలో బీఆర్ఎస్ లోకి నేతలు.. పార్టీ విస్తరణ పైన కార్యచరణ ప్రకటించేందుకు రంగం సిద్దమవుతోంది. దీంతో..బీఆర్ఎస్ ఏపీలో ఏ మేర ప్రభావం చూపిస్తుందీ.. ఎవరెవరు ఆ పార్టీలో చేరబోతున్నారనేది ఆసక్తి కరంగా మారుతోంది.