ఖైరతాబాద్ ఉప ఎన్నికకు BRS అభ్యర్ధి ఫిక్స్- కేసీఆర్ అనూహ్య ఎంపిక..!!
తెలంగాణ రాజకీయం ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది. దానం నాగేందర్ పైన అనర్హత వేటుతో ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. హైకోర్టు తన పై వేసిన అనర్హత వేటు పైన దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఉప ఎన్నిక పైన కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. గ్రేటర్ ఎన్నికలు సైతం ఉండటంతో... బీఆర్ఎస్ తమ అభ్యర్ధిని ఖరారు చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్ధిని ఫిక్స్ చేయటంతో పాటుగా ఈ ఉప ఎన్నిక పైన కేటీఆర్ కు కీలక దిశా నిర్దేశం చేసారు.
దానం నాగేందర్ పైన హైకోర్టు అనర్హత వేటుతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అనివార్యంగా మారుతోంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇవాళ లేదంటే రేపు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు గ్రేటర్ ఎన్నికలు ఉండటంతో.. ఖైరతాబాద్ బై పోల్ పై మాజీ సీఎం కేసీఆర్ ముఖ్య నేతలతో చర్చించారు. బీఆర్ఎస్ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మన్నె గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్ పేర్లు రేసులో ఉన్నాయి. అయితే.. కేసీఆర్ ఈ ఉప ఎన్నికలో సాయికిరణ్ యాదవ్‌ను బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తలసానికి ఫోన్ చేసి కేసీఆర్ చర్చించారని పార్టీ నేతల సమాచారం.

పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు
తలసాని ప్రస్తుతం గ్రేటర్ లో పార్టీకి కీలకంగా మారారు. తలసాని కుమారుడు బీఆర్ఎస్ తరపున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడారు. గత ఎన్నికల్లోనూ అదే పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ.. చివరి నిమిషంలో అధిష్టానం ఆ స్థానం నుంచి పద్మారావుగౌడ్ ను బరిలోకి దింపింది. అయితే, తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఖైరతాబాద్ నియోజకవర్గంలో గట్టి పట్టుంది. మంత్రిగా ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనుల్లో తలసాని కీలకంగా వ్యవహరించడం కలిసి వస్తుందని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. దీనికితోడు తలసాని సామాజిక వర్గంకు చెందిన ఓటర్లతోపాటు ఇతర బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటంతోపాటు.. వీరిలో ఎక్కువశాతం తలసాని కుటుంబానికి సానుకూలంగా ఉండటంతో బీఆర్ఎస్ అధిష్టానం సాయికిరణ్‌ను బరిలోకి దింపేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
ఈ ఎన్నిక కోసం వ్యూహాల పైన ఇప్పటికే కేటీఆర్ కు కేసీఆర్ దిశా నిర్దేశం చేసారు. సుప్రీంలో చోటు చేసుకొనే పరిణామాలు... నిర్ణయం తరువాత బీఆర్ఎస్ తమ అభ్యర్దిని అధికారికంగా ప్రకటించేలా ప్లాన్ చేస్తోంది.













Click it and Unblock the Notifications
