అప్పుడెట్లుండే తెలంగాణా.. ఇప్పుడెట్లయ్యింది తెలంగాణా: బీఆర్ఎస్ ప్రచారం, కాంగ్రెస్ సూపర్ పంచ్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిని మించి ఒకరు ప్రచారాన్ని సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రకరకాల వ్యూహాలతో ప్రచారాన్ని సాగిస్తుంటే, బీఆర్ఎస్ చేసే ప్రచారాన్ని టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ నేతల గాలి తీసే పనిలో పడింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రచారంలో దూకుడుగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళుతుంది. ప్రచారంలో కొత్త ఒరవడిని సృష్టించడానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నవంబర్ 30న వేలు పై పడుతుంది ఇంకు.. ఆ పైన తెలంగాణ రాష్ట్రమంతా పింక్ అంటూ ప్రచారం చేస్తున్న నేతలు, అభ్యర్థులతో అప్పుడు ఎట్లుండే తెలంగాణ... ఇప్పుడు ఎట్లైంది తెలంగాణ అంటూ అప్పటికి, ఇప్పటికి తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందింది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

డప్పు చప్పుళ్ళతో సందడిగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న వినూత్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే బి ఆర్ ఎస్ పార్టీ నేతలు చెబుతున్న అదే కంటెంట్ తో కాంగ్రెస్ పార్టీ నేతలు వారిని ఆడుకుంటున్నారు. అప్పుడు ఎట్లుండే తెలంగాణ.. ఇప్పుడు ఎట్లా అయింది తెలంగాణ.. అంటూ టార్గెట్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు కౌంటర్ వేస్తున్నారు.
అప్పట్లో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావుల ఫోటోలను పెట్టి వారి ఆర్థిక పరిస్థితి అర్థమయ్యేలా చూపించి, ప్రస్తుతం కెసిఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావుల ఆర్థిక పరిస్థితి ఏవిధంగా ఉందో ఇప్పటి ఫోటోలతో టార్గెట్ చేస్తున్నారు. అప్పట్లో కెసిఆర్ అంత ఆర్థికంగా గట్టిగా లేరని, కానీ ప్రస్తుతం రాష్ట్రాన్ని దోచుకుని దొరల పోకడ పోతున్నారని టార్గెట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.
బీఆర్ఎస్ పార్టీ వేటినైతే ప్రచార అస్త్రాలుగా మలుచుకుంటుందో.. కాంగ్రెస్ పార్టీ వాటినే రివర్స్ గా బి ఆర్ ఎస్ మీద ప్రయోగిస్తోంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఎత్తులు, వాటిపైనే కౌంటర్లు వేస్తూ కాంగ్రెస్ పార్టీ చిత్తులు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారాయి.












Click it and Unblock the Notifications