ఉపసంహరించకోకుంటే పోరాటం తప్పదు - హరీష్ హెచ్చరిక..!!
మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి హెచ్చరిక చేసారు. రూ.500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రేవంత్ సర్కార్ రూ.87 కోట్లకే ప్రైవేటు పరం చేయడానికి కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లేకుంటే తాము పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తులను కమీషన్ల కోసం పాలకులు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్, అజామాబాద్‌లో తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు చెందిన రూ.500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన రేవంత్ సర్కార్.. రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా మారిపోయిందని విమర్శించారు. రూ.500 కోట్ల విలువ చేసే ఆయిల్‌ఫెడ్ భూములను కేవలం రూ.87 కోట్లకు ప్రైవేటు పరం చేయడానికి సిద్ధమైందని లేఖలో వివరించారు. ఆ సొమ్మును చెల్లించేందుకు ఆయిల్‌ఫెడ్ సిద్ధంగానే ఉందని, అయినా వారిని కాదని ప్రైవేటు వ్యక్తులకై భూములను ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు ఉత్సాహం చూపిస్తోందని ఆయన ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ప్రైవేట్ శక్తులకు తలొగ్గకుండా వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తిని చిత్తశుద్ధితో కాపాడామని గుర్రతు చేసారు.

హరీష్ కీలక అంశాల ప్రస్తావన
ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. పేదల పొట్టగొట్టి పెద్దలకు పల్లీలు, బఠాణీల్లా వేల కోట్ల రూపాయల భూములు పంచుతోందని విమర్శించారు. 1987లో సుప్రీంకోర్టు ప్రైవేట్ సంస్థకు మొట్టికాయలు వేసి ప్రభుత్వానిదే హక్కు అని తేల్చినా.. కమీషన్ల కోసం కాంగ్రెస్ నేతలు తీర్పులనే తుంగలోకి తొక్కారని ధ్వజమెత్తారు. ఒకవైపు సామాన్యుల ఇళ్లను 22A జాబితాలో పెట్టి వేధిస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఖరీదైన ప్రభుత్వ భూములను కమీషన్ల కోసం కారుచౌకగా ప్రైవేట్‌కు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే ముఖ్యమంత్రి ఈ అక్రమ కేటాయింపును రద్దుచేసి, ఆ భూమిని ఆయిల్‌ఫెడ్‌కే దక్కేలా ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించాలని హరీశ్‌రావు సూచించారు. ప్రజల సొత్తును ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, ఈ నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తామని హరీష్ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications