రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి
నల్గొండ: ప్రముఖ తెలుగు సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని ఓ బీఆర్‌ఎస్ నాయకుడు దుర్మరణం చెందారు. నల్గొండ శివారులో బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో బీఆర్‌ఎస్ నల్గొండ పట్టణ ప్రధాన కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు (49) ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నటుడు రఘుబాబు బుధవారం సాయంత్రం బీఎండబ్ల్యూ కారు (కేఏ 03 ఎంపీ 6914)లో హైదరాబాద్ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రం శివారుకు రాగానే అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై దుప్పలపల్లి రోడ్డులో ఉన్న దత్తసాయి వెంచర్‌కు బైక్‌పై వెళ్తున్న బీఆర్‌ఎస్ నల్గొండ టౌన్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు(49)ను ఆయన కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన జనార్దన్‌రావు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో రఘుబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు సొంత పూజీకత్తుపై విడుదల చేసినట్లు సమాచారం. మృతుని భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. జనార్ధన్ రావు స్వస్థలం నకిరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామం. జనార్ధన్ రావుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
కాగా,జనార్దన్ రావు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో చురుకైన నేతగా కొనసాగారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో బీఆర్‌ఎస్‌లో చేరారు. గత మున్సిపల్ ఎన్నికల్లో శ్రీనగర్ కాలనీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. కాగా, జనార్దన్ రావు మృతి పట్ల మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications