మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్యే మైనంపల్లి వార్నింగ్..!!
తెలంగాణలో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. ఎన్నికల సీట్ల ఖరారు వేళ నిరసన స్వరాలు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నేరుగా మంత్రి హరీశ్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. మెదక్ లో హరీష్ రావు పెత్తనం చేస్తున్నారని, అంతు చూసే వరకు వదలబోనని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో హరీష్ ను అడ్రస్ లేకుండా చేస్తానని శపధం చేసారు. తనతో పాటు తన కుమారుడికి సీటు ఇస్తేనే పోటీ చేస్తామన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్దుల తొలి జాబితా విడుదల కానుంది. ఈ సమయంలోనే పార్టీలో అసమ్మతి స్వరాలు బయట పడుతున్నాయి. తిరుమలకు వచ్చిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనం పల్లి హనుమంత రావు నేరుగా మంత్రి హరీష్ పైన సంచలన వ్యాఖ్యలు చేసారు. తన కుమారుడికి మెదక్ సీటు ఇస్తేనే తాను పోటీ చేస్తానని హనుమంతరావు స్పష్టం చేసారు. హరీష్ ఏ పరిస్థితుల్లో మెదక్ హాస్టల్ కు వచ్చారో అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. హరీష్ రాజకీయంగా ఎంతో మందిని అణిచివేసాడని మండిపడ్డారు. మల్కాజ్ గిరిలో తాను పోటీ చేస్తానని..మెదక్ లో తన కుమారుడిని ఖచ్చితంగా గెలిపించుకుంటానని చెప్పారు.

తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని హనుమంతరావు స్పష్టం చేసారు. తన కుటుంబంలో ఇద్దరికీ టికెట్ ఇస్తేనే పోటీ చేస్తామని ట్విస్ట్ ఇచ్చారు. లేకుంటే స్వతంత్ర అభ్యర్దులుగా పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు. హరీష్ సిద్దపేట తరహాలో మెదక్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. కొవిడ్ సమయంలో తన కుమారుడు ఎంతో ప్రజాసేవ చేశాడని.. దాదాపు రూ.8 కోట్లు సొంత డబ్బు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మెదక్‌లో హరీశ్‌రావు నియంతలా వ్యవహరిస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సైతం సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. రాజకీయాలు ప్రజల కోసమే చేయాలన్నారు. పదవుల కోసం కాదు అని తన తండ్రి మాటలను ప్రతిసారి స్మరించుకుంటానని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్దుల తొలి జాబితా విడుదల చేయనున్నారు. ఈ సమయంలో టికెట్ దక్కదనే నిర్దారణకు వచ్చిన నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ కుమార్తె కవిత ద్వారా తమ చివరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తొలి జాబితాలో 105 మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సిట్టింగ్ ల్లో ఆరుగురుని తప్పిస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ లకు సీట్లు ఇవ్వద్దంటూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక, కేసీఆర్ విడుదల చేసే జాబితా పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications