ఐటీ దాడులకు తనకు సంబంధం లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు!!
ఎన్నికల సమయంలో నల్గొండ జిల్లా కేంద్రం తో పాటు మిర్యాలగూడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే .జిల్లాలోని మిర్యాలగూడ, నల్లగొండ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల అనుచరులు, సన్నిహితుల ఇళ్లు, వ్యాపార సముదాయాల లో ఈ తెల్లవారు జాము నుంచి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇక తాజా ఐటీ దాడులపై బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు స్పందించారు.
జరుగుతున్న ఐటీ దాడులకు తనకు ఎటువంటి సంబంధం లేదని నల్లమోతు భాస్కరరావు పేర్కొన్నారు. ఐటి అధికారులు వ్యాపారులపై దాడులు చేస్తున్నారని, ఐటీ అధికారులు వాళ్ల పని వాళ్ళు చేసుకుంటారని పేర్కొన్నారు. ఐటీ అధికారులు దాడులు చేస్తున్న వారితో తనకు ఎటువంటి వ్యాపార లావాదేవీలు లేవని ఆయన స్పష్టం చేశారు.

తనకు ఏవైనా వ్యాపారాలు ఉన్నట్టు నిరూపిస్తే అవి తిరిగి ఇచ్చేస్తానని ఆయన సవాల్ విసిరారు. తనకు ఎలాంటి ఐటీ కంపెనీలు కానీ పవర్ ప్రాజెక్టులు కానీ లేవని చెప్పారు. కొంతమంది తనను అప్రతిష్ట పాలు చేయడం కోసమే ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నల్లమోతు భాస్కరరావు.
కాగా ఈరోజు తెల్లవారుజాము నుండి ఐటీ అధికారులు మిర్యాలగూడ బీఅర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే భాస్కర్ రావు బినామీగా భావిస్తున్న కాంట్రాక్టర్ వింజమూరి శ్రీధర్ ఇంటిపై ఐటీ దాడులు కొనసాగిస్తున్నారు. స్థానిక వైదేహి టౌన్షిప్ లో ఉన్న ఆయన నివాసంలో అధికారులు సోదాలు జరుపుతున్నారు. దీంతో పాటు రంగా రంజిత్, రంగా శ్రీధర్, బండారు కుశలయ్య తదితరుల నివాసాలలో కూడా ఐటి అధికారులు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలం ముకుందాపురం సాల్వెంట్ ఆయిల్ మిల్లులో, నిడమనూరు మండలం శాఖాపురం లో గల భాస్కర్ రావు నివాసంలో కూడా ఐటి అధికారులు సోదాలు జరుపుతున్నారు. అలాగే నల్లగొండ బిఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల రెడ్డి అనుచరుడైన కందుకూరి మహేందర్ కు చెందిన ఆయిల్ మిల్, నివాసాలలో సోదాలు నిర్వహిస్తున్నారు. 40 మంది అధికారులు బృందాలుగా విడిపోయి ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు .












Click it and Unblock the Notifications