మంత్రి కోమటిరెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల షాక్.. సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ !
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మంత్రి కోమటిరెడ్డి సభలో అవాస్తవాలు మాట్లాడుతున్నారని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రోడ్లు, భవనాల శాఖకు సంబంధించి మంత్రి ఇచ్చిన సమాధానం సభను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని వినతి పత్రంలో పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో సీఆర్ఎఫ్ నిధులు రాలేదని మంత్రి వ్యాఖ్యానించినట్టు ఫిర్యాదులో స్పష్టం చేశారు. నల్గొండ నియోజకవర్గ రోడ్లకు నిధులు కేటాయించలేదని, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు ఎస్క్రో అకౌంట్ తెరవలేదంటూ మంత్రి ఇచ్చిన సమాధానం పూర్తిగా అవాస్తవమని విన్నవించారు. సభను తప్పుదోవ పట్టిస్తున్న మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. అందుకు సంబంధించిన ఆధారాలను స్పీకర్‌కు సమర్పించారు. కోమటిరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును తక్షణమే అనుమతించాలని కోరారు.

మరోవైపు అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య మరోసారి డైలాగ్ వార్ నడిచింది. రోడ్ల నిర్మాణం విషయంలో తాను అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం సరిగా చెప్పలేదన్న హరీష్ రావు వ్యాఖ్యలకు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. పీపీపీ మోడల్‌లో రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు లేవని.. హైబ్రిడ్ అన్యూటీ మోడల్ లో ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లు నిర్మిస్తుందని చెప్పారు. 100 శాతం నిధులను ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు.
గ్రామీణ, రాష్ట్ర రహదారులపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం టోల్ ఫీజు వసూలు చేయబోతుందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అవన్నీ అవాస్తవేలనని మంత్రి కోమటి రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కే రోడ్లు వేశారని కోమటి రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రమంతా కలియ తిరిగి చూద్దామా అంటూ మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ చేశారు. ఇక మంత్రి కోమటి రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్‌ను మాజీ మంత్రి హరీష్ రావు స్వీకరిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications