అసెంబ్లీ నుంచి BRS ఎమ్మెల్యేలు వాకౌట్.. గన్ పార్క్ వద్ద నిరసన
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో శాసన సభలో కాళేశ్వరం నివేదికపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే ఈ సందర్భంగా BRS ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు మహిళా మార్షల్స్ ను రంగంలోకి దింపారన్నారు. మైక్ కోసం గంటన్నర సేపు ఎదురు చూసినా స్పీకర్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. సభ నుంచి బయటికి వచ్చి గన్ పార్క్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు.
మహిళా మార్షల్స్ ను ఉపయోగించి తమను అడ్డుకోవాలని చూసిన రేవంత్ సర్కార్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మహిళల్ని అడ్డు పెట్టుకొని ప్రభుత్వాన్ని నడుపుతారా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం పీసీ ఘోష్ కమిషన్ ప్రతులను BRS ఎమ్మెల్యేలు చించేశారు. కమిషన్ కాపీలను చెత్త బుట్టలో వేసి తమ నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణను జల సౌధంగా మార్చిన కేసీఆర్ పై కేసులు పెడుతారా..? అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు BRS నాయకులను రేవంత్ సర్కార్ ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో BRS ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గంగుల కమలాకర్, కాలేరు వెంకటేశ్, పద్మా రావు, సునీతా లక్ష్మా రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం అయిన సందర్భంగా ఉదయం బీసీ బిల్లుతో పాటు పలు అంశాలపై చర్చలు జరిపారు. సాయంత్రం కాళేశ్వరం నివేదికపై చర్చ మొదలైంది. ముందుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.87,449 కోట్లు ఖర్చు చేశారని మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి మేడిగడ్డ దెబ్బతిన్నదన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు నిరుపయోగంగా మారాయన్నారు. రూ.21 వేల కోట్లతో కట్టినవన్నీ 20 నెలలుగా నిరుపయోగంగా మారాయని తెలిపారు. మేడిగడ్డలో బ్యారేజ్ నిర్మించవద్దని నిపుణుల కమిటీ స్పష్టంగా చెప్పిందని.. అలాగే మేడిగడ్డ వద్ద బ్యారేజ్ వద్దని వ్యాప్కోస్ నిపుణులు కూడా చెప్పారని ఉత్తమ్ తెలిపారు.

రూ. లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగినప్పుడు BRS ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు. డ్యామ్ కు, బ్యారేజ్ కు తేడా లేకుండా పనులు చేశారని ఎన్‌డీఎస్‌ఏ నివేదికలో ఉందన్నారు. మేడిగడ్డలో పూర్తి నీరు నిల్వ చేసి కూలిపోయేందుకు కారణమయ్యారని తెలిపారు. మేడిగడ్డలో పూర్తిగా నీరు నిల్వ చేయవద్దని అప్పటి అధికారులే చెప్పారని గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications