మరో లేఖ విడుదల చేసిన కవిత.. ఈసారి సీఎం రేవంత్ కు ..?
తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆమె తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ సంచలనంగా మారిన తరుణంలో ఈసారి ఆమె సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆ లేఖలో.. జీహెచ్ఎంసీలో మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఇన్‌స్టంట్ రిపేర్ టీమ్స్ టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సంస్థలకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయని ఆమె లేఖలో పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన బీసీ కాంట్రాక్టర్లకు నష్టం చేసేలా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఒక విదేశీ సంస్థకు చెందిన వాహనాలు మాత్రమే ఈ పనుల కోసం వినియోగించేలా నిబంధనలు రూపొందించారని కవిత ఆరోపించారు. ఆ సంస్థకు హైదరాబాద్‌లో రెండు షోరూములు మాత్రమే ఉన్నాయని అన్నారు.

ఆ షోరూంల నిర్వాహకులు తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లతో ఎంఓయూ చేసుకునేందుకు ససేమిరా అంటున్నారని లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ కాంట్రాక్టర్లు కర్ణాటక షోరూంల డీలర్ల నుంచి ఎంవోయూలు తెచ్చుకున్నా వాటి ఫిజికల్ కాపీలు తక్కువ వ్యవధిలో తెచ్చి ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు వేర్వేరుగా టెండర్లు పిలిచేవారని గుర్తుచేశారు. ఇప్పుడు తొమ్మిది జోన్‌ల వారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా అధికారులు పేర్కొన్న స్పెసిఫికేషన్స్ కూడిన వాహనాల్లో ఒక క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదని ఎమ్మెల్సీ కవిత వివరించారు. గతంలో ఇందుకు వినియోగించిన వాహనాల్లో రెండు నుంచి మూడు క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించే వారని స్పష్టం చేశారు.
అధికారులు ఒక సంస్థకు, రెండు కాంట్రాక్ట్‌ల ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు మార్చడంతో ఒక్కో ఏడాదికి రూ.5.85 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. ఈ టెండర్లను వెంటనే రద్దు చేసి.. గతంలో మాదిరిగా వార్డుల వారీగా టెండర్లు పిలిస్తే 150 మంది స్థానిక కాంట్రాక్టర్లకు ఉపాధి లభిస్తుందని చెప్పుకొచ్చారు. మున్సిపల్ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ శాఖలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి సారించాలని కోరారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications