సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్న కవిత: ఎందుకంటే?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను మంగళవారం వెనక్కి తీసుకున్నారు. ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై విచారణ అవసరం లేదని భావించి ఉప సంహరించుకున్నట్లు ఆమె తరఫు లాయర్ తెలిపారు. కాగా,
ఈ కేసు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ గత ఏడాది మార్చి 14న కవిత సుప్రీంను ఆశ్రయించారు.
సీఆర్పీసీ నిబంధనల ప్రకారం మహిళలను కార్యాలయాల్లో విచారణ చేయకూడదని, ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED)ను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ కవిత తరఫు న్యాయవాదులు కోరగా.. అందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. మార్చి 24న విచారిస్తామని స్పష్టం చేసింది. అప్పుడు వాయిదా పడి, చివరకు 27న తొలిసారి ఈ పిటిషన్పై విచారణ జరిగింది.

ఈ రిట్ పిటిషన్పై అప్పటికే ఈడీ కెవియట్ పిటిషన్ దాఖలు చేయడంతో రెండింటిపై సుప్రీం విచారించింది. అప్పటి నుంచి ఈ వ్యాజ్యం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. సంవత్సర కాలంగా కోర్టులో నలుగుతున్న ఈ పిటిషన్పై మార్చి 15న మరోమారు విచారించింది సుప్రీంకోర్టు. ఇరువురి తరఫు న్యాయవాదుల సుధీర్ఘ వాదనల అనంతరం నేటికి(మార్చి 19కి) వాయిదా వేసింది. మంగళవారం మరోసారి దీనిపై విచారణ జరగాల్సి ఉంది.
అయితే ఈ కేసులో ఇప్పటికే కవిత అరెస్ట్ కావడంతో ఈ రిట్ పిటిషన్పై విచారణ అవసరం లేదని భావించిన కవత తన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి తమ వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. పిటిషన్ ఉప సంహరణకు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ బెంచ్ అనుమంతిచారని చెప్పారు. ఈ కేసులో చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications