ఢిల్లీ చేరుకున్న కేసీఆర్: 14న బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెన్, వాస్తు ప్రకారమే నిర్మాణం
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం సాయంత్రం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీ విమానాశ్రయంలో సీఎం కేసీఆర్‌కు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ స్వాగతం పలికారు.
డిసెంబర్ 14వ తేదీని డిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు చేరుకుని పనులను పర్యవేక్షిస్తున్నారు. పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ప్రముఖ వాస్తు శిల్పి సుద్దాల సుధాకర్ తేజతో కలిసి ప్రశాంత్ రెడ్డి, సంతోష్ కుమార్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. వాస్తుకు అనుగుణంగా సుధాకర్ తేజ సూచనలతో కార్యాలయాన్ని మార్పులు చేర్పులతో తీర్చిదిద్దుతున్నారు.

బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా కేసీఆర్.. రాజశ్యామల యాగం చేయనున్నారు. కాగా, బీఆర్‌ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి బీఆర్‌ఎస్ ప్రతినిధులు హాజరుకానున్నారు. వారితో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ప్రారంభోత్సవానికి హాజరవుతామని పార్టీ కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఇక తెలంగాణ నుంచి కూడా ప్రజాప్రతినిధులు, నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్లనున్నారు. మరోవైపు, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలిశాయి. కేసీఆర్ ఫర్ ఇండియా, దేశ్ క నేత.. కిసాన్ కీ భరోసా, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాలతో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications