మేడారం జాతరలో నయా "బిజినెస్".. బక్కెట్ వేడినీళ్లు రూ.50 మాత్రమే !!
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు సమయం సమీపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేళాగా పేరుగాంచిన ఈ ఉత్సవం.. ప్రతి రెండేళ్లకోసారి జరుగుతోంది. ఇందుకోసం దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అందుకే ఈ జాతరను "దక్షిణ భారత కుంభమేళా" అని కూడా పిలుస్తారు. గిరిజన సమాజం ఆరాధించే ఈ జాతరలో గిరిజన సంప్రదాయాలు, వారి పూజా విధానాలు, సంస్కృతి ప్రతిబింబిస్తాయి. కేవలం ఆధ్యాత్మిక ఉత్సవం మాత్రమే కాకుండా, ఇది గిరిజన గౌరవానికి ప్రతీకగా అభివర్ణిస్తారు.
మరికొద్ది రోజుల్లో ఈ జాతరను ఘనంగా నిర్వహించనున్నారు. జనవరి 28 నుంచి 31 వరకు ఈ మహా జాతర వైభవంగా జరగనుంది. జనవరి 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరనున్నారు. జనవరి 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. జనవరి 30న భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకోనున్నారు. జనవరి 31న అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. మూడో రోజైన జనవరి 30న సమ్మక్క, సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజుల వనప్రవేశం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ రోజు దేశం నలుమూలల నుంచి భక్తులు విపరీతంగా తరలి వచ్చి బంగారం, వెండి, జుట్టు, కోడిపుంజులు, తేనె, చెల్లింపు డబ్బులు వంటి విభిన్న రకాల మొక్కులు సమర్పిస్తారు.

కాగా ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా అమ్మవార్లను దర్శించుకోవడానికి తండోపతండాలుగా వస్తున్నారు. అయితే కొబ్బరికాయలు, బెల్లం (బంగారం), పూజా సామగ్రి అమ్మకాలకు ఇప్పటికే అధికారులు టెండర్లు వేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. కానీ భక్తుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొత్త బిజినెస్ లు సైతం తెరపైకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం పండుగ వాతావరణంతో పాటు చలి తీవ్రత కూడా అధికంగా ఉంది. దీంతో భక్తులు జంపన్న వాగులో స్నానాలు చేసేందుకు ఒకింత వెనుకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న కొందరు వ్యక్తులు జంపన్న వాగు సమీపంలో వేడి నీళ్లు విక్రయిస్తున్నారు. ఒక బకెట్ వేడి నీటిని రూ.50 చొప్పున అమ్ముతూ రూ.వేలల్లో సంపాదిస్తున్నారు. చలిలో స్నానం చేయలేని వారంతా వేడి నీటిని కొనుగోలు చేసి పని కానిచ్చేస్తున్నారు. దీంతో ఈ బిజినెస్ చేస్తున్న వారి తెలివితేటలు గ్రేట్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.













Click it and Unblock the Notifications