వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మండీ దెబ్బ: నాఫెడ్ ఎక్కడ? రైతులకు మిర్చి ఘాటు, లబోదిబో...

మిర్చి రైతుల పరిస్థితి అద్వాన్నంగా మారిపోయింది. వ్యాపారులు అనుక్షణం ధరలు తగ్గించేస్తున్న వైనంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆరుగాలం రైతులు కష్టపడి పంట పొలాలు సాగు చేసి వివిధ రకాల పంటలు సాగిస్తుంటారు. కానీ భారీగా పంటల దిగుబడి వస్తే మార్కెట్‌లో మధ్య దళారులు, వ్యాపారులు మాయాజాలంతో.. రకరకాల సాకుతో ఆయా పంటల ధరలు దారుణంగా తగ్గించడం అనునిత్యం ఆనవాయితీగా మారుతోంది.

పాలకులు, అధికార యంత్రాంగం పట్టించుకోకపోగా అన్నదాత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమూ సాధారణంగానే జరుగుతున్నది. అయితే తెలంగాణలో తొలి సర్కార్ కొలువుదీరిన మొదటి నుంచే ధాన్యాలు, ఇతర పంటల ఉత్పత్తుల కొనుగోలు ద్వారా రైతుకు గిట్టుబాటు ధర అందేలా చేస్తున్నది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో వరి పంట, పత్తి పంటలను సరసమైన ధరలకు కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నది. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

నాఫెడ్‌తో సంప్రదింపులు జరుపలేరా?

చివరకు 'ఉల్లి'కి తక్కువ ధర నిర్ణయిస్తే ప్రభుత్వమే రంగంలోకి దిగి ఉపశమన చర్యలు చేపట్టింది. కానీ ఈ ఏడాది కూడా పత్తి, వరి పంటలను మార్క్ పెడ్, సీసీఐ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయించింది. కానీ మిర్చి రైతుల పరిస్థితి అద్వాన్నంగా మారిపోయింది. వ్యాపారులు అనుక్షణం ధరలు తగ్గించేస్తున్న వైనంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కానీ పత్తి కొనుగోలు కోసం సీసీఐతో సంప్రదింపులు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం, మార్కెటింగ్ శాఖ, మంత్రి హరీశ్.. మిర్చి కొనుగోలుకు నాఫెడ్‌తో సంప్రదింపులు జరుపలేరా? రైతన్నకు అండగా నిలిచేవారు లేరా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయంగా తగ్గకున్నా..

అంతర్జాతీయ మార్కెట్‌లో మిర్చి, మిర్చి పొడి ధర పెద్దగా తగ్గిందేమీ లేదు. కానీ, దేశీయ మార్కెట్లలో ధర పెరుగకుండా వ్యాపారులంతా 'సిండికేట్'గా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా తగ్గిస్తున్నారు. ఉదాహరణకు న్యూయార్క్‌లో గత నెల చివరివారంలో కిలో మిరపకాయల ధర 3.09 డాలర్లు ఉండగా.. 2016 మార్చి 24న 3.75 డాలర్లుందని భారత సుగంధ ద్రవ్యాల మండలి తాజా నివేదికలో పేర్కొంది. అంటే ఏడాదిలో ధర తగ్గుదల 17.6 శాతం మాత్రమే

తెలుగు రాష్ట్రాల్లో 66% మిర్చి ధర తగ్గుదల

తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో మాత్రం 66% తగ్గుదలతో కిలో ధర రూ.150 నుంచి 50కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు భారీగా తగ్గకున్నా, మన దేశంలో మాత్రం పంట దిగుబడి పెరిగిందని, నాణ్యత తగ్గుముఖం పట్టిందన్న సాకుతో వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే దేశంలోనే అతిపెద్ద మిరప మార్కెట్‌ వరంగల్‌లో గతేడాదితో పోల్చితే ధరలు సగానికంటే ఎక్కువగా తగ్గాయి. అప్పుడు నాణ్యమైన మిర్చికి రూ.13వేల వరకూ ఇస్తే ఈసారి రూ.3000లకు పడిపోయింది.

Business man mis lead the Mirchi farmers

1.17 లక్షల హెక్టార్లలో మిర్చి సాగు

ఈ సీజన్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు 1.17లక్షల హెక్టార్లలో మిర్చి సాగు చేశారు. ఇది సాధారణంకన్నా 14 శాతం అధికమని ఉద్యానశాఖ తెలిపింది. 7 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. గతంలో తెలంగాణ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలతోపాటు చైనా, మలేషియా, సింగపూర్‌ దేశాలకూ ఎగుమతులు ఉండేవి. ఇప్పుడా ఎగుమతులు మందగించడంతోనే ధర తగ్గిందని వరంగల్‌ వ్యాపారులు చెప్తున్నారు.

నాణ్యత సాకు చూపుతున్న వ్యాపారులు

మిర్చి తోటల్లో జనవరిలో కోసే తొలి కోత కాయలు నాణ్యతతో ఉంటాయి. కానీ ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్నవి మూడో కోతవి కావడం వల్ల నాణ్యత తక్కువగా ఉందన్న సాకు చెప్పి వ్యాపారులు ఇష్టా రాజ్యంగా ధర తగ్గించేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ వ్యాపారుల వాదన సరి కాదని, గత జనవరి, ఫిబ్రవరి నెలల్లో కోసిన కాయలను సైతం ధర లేక ఇళ్లలో నిల్వ చేసిన రైతులు ఇప్పుడిప్పుడే మార్కెట్లకు తరలిస్తుండగాన్ని తమకు అదునుగా తీసుకున్న వ్యాపారులు అన్నీ మూడో కోతవని, నాణ్యత లేవని ధర తగ్గిస్తున్నారు.

నోట్ల రద్దు, లావాదేవీల్లో ప్రతిష్ఠంభన సాకుతో ధర తగ్గిస్తున్న వ్యాపారులు

దీనికి తోడు పెద్దనోట్ల రద్దు ప్రభావం, బ్యాంకు లావాదేవీల్లో ప్రతిష్టంభన వల్ల తమ చేతిలో నగదు లేదని.. అంతా ఆన్‌లైన్‌ లావాదేవీలంటే ఐటీ భయంతో కొందరు వ్యాపారులు తక్కువగా కొంటున్నట్లు చెప్తున్నారు. దీనివల్ల పోటీ తగ్గిపోవడంతో ధరలు పతనం అవుతున్నాయి. చిన్న సన్నకారు రైతులు తమకు గల రెండు, మూడు ఎకరాల్లో లక్షలు ఖర్చు చేసి పంట దిగుబడి వస్తే కష్టాలు కడతేరతాయని భావించి మిర్చి సాగు చేస్తున్నారు.

వేల రూపాయల్లో తగ్గిన ధరలు

గత వారం మలక్ పేట మార్కెట్ తీసుకొచ్చిన మిర్చి బస్తాల కొనుగోలుకు ఏ వ్యాపారి కూడా ముందుకు రాలేదు. ఎర్రగా ఉన్న బస్తాలకు మాత్రం క్వింటాల్ ధర రూ.2500 - 2800 మాత్రం ధర పెడతామని బుకాయింపులకు పాల్పడుతున్నారు. తాలుకాయలను ఉచితంగా మార్కెట్‌లో వదిలేసి పోవాలని అంటున్నారు. గతేడాది ఇదే తాలు కాయలకు క్వింటాల్‌కు రూ.4 వేల దాకా ఇచ్చారు. ఇప్పుడు వదిలేసి పొమ్మంటున్నారు. మార్కెట్‌కు మిర్చి రవాణా, కూలీ కోసం రూ.15 వేలు ఖర్చవుతోందని రైతులు చెప్తున్నారు.

ధర పెంచమంటే రోజుకు రూ.1000 తగ్గింపు

వందల కొద్దీ మిర్చి పండించిన రైతులు మార్కెట్‌కు తెచ్చి తమ పంటకు అధిక ధర పెట్టమని కోరుతున్నారు. అదే రోజు క్వింటాల్‌కు రూ.5,500కు కొంటామని వ్యాపారులడిగితే మరికాస్త ఇవ్వమని రైతులు అభ్యర్థించారు. ఇవ్వలేదని వేచిచూస్తే మంగళవారం రూ.1000 తగ్గించి అడుగుతున్నారని వాపోయారు. తెల్లారేసరికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన మార్పులేమీ లేవు. కానీ క్వింటాల్ ధర ఏకంగా రూ.1000 దాకా తగ్గించేశారు. ప్రతి మార్కెట్‌లో వ్యాపారులిలా దోచుకుంటున్నారు. గతేడాది క్వింటాల్ మిర్చి ధర రూ.12 వేలు ఉందని ఈ సారి అధికంగా పంటలు సాగు చేసినా క్వింటాల్ మిర్చి రూ.3000 అమ్ముకోవాల్సి వస్తుందని రైతులు చెప్తున్నారు. మార్కెట్ లో మిర్చి నిల్వ చేసుకునేందుకు పెద్ద వ్యాపారులకు మినహా చిన్న, సన్నకారు రైతులకు వెసులుబాటు లేక ఇబ్బందుల పాలవుతున్నారు.

English summary
Mirchi farmers misleaded by business man in the name decreasing of rates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X