మాస్టర్ ప్లాన్ల రద్దు రైతులవిజయం.. ఇదే ఉద్యమస్ఫూర్తితో ఆ పని చెయ్యండి: బండి సంజయ్
కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఆ రెండు జిల్లాల రైతుల ఉద్యమస్ఫూర్తికి ఆయన అభినందనలు తెలియజేశారు. ఇది రైతు పోరాట విజయమని ఆయన అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, రైతులు తమ ఉద్యమ స్ఫూర్తితో బిఆర్ఎస్ కు గుణపాఠం చెప్పారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం బీజేపీ పోరాటం చేసింది: బండి సంజయ్
బీఆర్ఎస్ సర్కార్ ను తరిమికొట్టే దాకా ఇదే ఉద్యమస్ఫూర్తి కొనసాగించాలని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు విషయంలో వెనకడుగు వేయకుండా రైతులు చేసిన పోరాటం ప్రభుత్వం మెడలు వంచిందన్నారు.
కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు పోరాటంలో తాను స్వయంగా పాల్గొన్నానని, తనతో పాటు ఎంతో మంది బిజెపి కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నారని, నాన్ బెయిలబుల్ కేసులను కూడా లెక్కచేయకుండా రైతుల కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. ఎన్ని నిర్బంధాలు, మరెన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడలేదన్నారు.

ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్
కెసిఆర్ పాలనలో రైతులే కాదు సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, ప్రజలను పీకల్లోతు అప్పుల్లో ముంచారని బండి సంజయ్ తెలిపారు. సామాన్యులను బతకలేని స్థితికి తీసుకొచ్చారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, కుటుంబ పాలన, మరియు నియంత పాలనతో రాష్ట్ర ప్రజల జీవన స్థితిగతులు పూర్తిగా దిగజార్చారని బండి సంజయ్ మండిపడ్డారు.

కేసీఆర్ సర్కార్ ను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది
కెసిఆర్ సర్కార్ ను తరిమికొట్టాల్సిన అవసరం ఉందని, ఆ సమయం ఆసన్నమైందని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కెసిఆర్ పాలన ఇలా కొనసాగితే తెలంగాణ రాష్ట్రం మరో శ్రీలంక, పాకిస్తాన్ లా అవకాశం ఉందని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. కామారెడ్డి, జగిత్యాల జిల్లా రైతాంగం చూపిన తెగువ, పోరాట పటిమా అందరికీ ఆదర్శం అని పేర్కొన్న బండి సంజయ్ ఇక ఇదే బాటలో బీఆర్ఎస్ పార్టీని గద్ద దించేదాకా ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని బిజెపి తెలంగాణ పక్షాన మనవి చేసుకుంటుందని బండి సంజయ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications