పసుపు రైతుల కన్నీళ్లు కనిపించటం లేదా? రేవంత్ రెడ్డి, అరవింద్ లను తూర్పారబట్టిన కవిత
తెలంగాణ రాష్ట్రంలో పసుపు రైతన్న కన్నెర్ర చేస్తున్నాడు. తమకు మద్దతు ధర కల్పించాలని పసుపు రైతులు కలెక్టరేట్ ముట్టడించడంతో పాటు. పలు ప్రాంతాలలో ఆందోళన చేపట్టడంతో పసుపు రైతుల ఉద్యమం ప్రస్తుతం రాజకీయంగా సంచలనంగా మారింది. ఇక పసుపు రైతులకు మద్దతుగా రంగంలోకి దిగిన ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్, బీజేపీ ల తీరుపై మండిపడుతున్నారు.
రేవంత్ రెడ్డిని, అరవింద్ ను నిలదీసిన కవిత
తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని, పసుపు రైతులకు కష్టాలు తీరుస్తానని మాటిచ్చిన ధర్మపురి అరవింద్ ను టార్గెట్ చేసిన నిప్పులు చెరుగుతున్నారు.తాజాగా నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర రాక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని నిలదీశారు.

పసుపు రైతుల మద్దతు ధరపై కవిత ప్రశ్నల వర్షం
పసుపు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మాటలు చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి క్వింటాల్ పసుపుకు 15000 మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో మాటిచ్చారని కానీ ఇప్పుడు కనీసం 9000 కూడా రాని పరిస్థితి ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ రైతన్నల గోడు పట్టించుకోరా?
ఇది రైతన్నలను మోసం చేయడం తప్ప మరేమిటి అంటూ ఆమె నిలదీశారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 15000 రూపాయల మద్దతు ధర చెల్లించి పసుపు పంటను కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. పసుపు బోర్డు తీసుకువచ్చామని చెబుతున్న బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం పసుపు రైతులను పరామర్శించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
బండి సంజయ్ దీనికి సమాధానం చెప్పాలి
పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ఎటువంటి ప్రయోజనం కలగడం లేదని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. పసుపు రైతులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తామని, ధరలు పెంచుతామని పసుపు బోర్డు ప్రారంభోత్సవం లో చెప్పిన బండి సంజయ్ ప్రస్తుతం ఏం చేస్తున్నారని కవిత నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పసుపు రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications