బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై కేసు నమోదు: ఎందుకంటే?
హైదరాబాద్: ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై కేసు నమోదైంది. కిషన్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, బెదిరింపుల కేసు నమోదు చేశారు పోలీసులు. కిషన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఆమోయ్ కుమార్, ఇబ్రహీంపట్నం మాజీ మున్సిపల్ కమిషనర్ ఎండీ యూసుఫ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
మున్సిపల్ ఛైర్‌పర్సన్ కప్పరి స్రవంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ పోస్టు కోసం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రూ. 2.5 కోట్లు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బుడగ జంగాల కులానికి చెందిన తాను మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎంపికైన దగ్గరి నుంచి కులం పేరుతో మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు వేధిస్తున్నారని మున్సిపల్ ఛైర్మన్ స్రవంతి ఫిర్యాదులో తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం మాజీ మున్సిపల్ కమిషనర్ యూసఫ్, అప్పటి వైస్ ఛైర్మన్ కు బాధ్యతలు అప్పగించేందుకు తనను నిత్యం లీవ్ పెట్టాలని బెదిరించారని స్రవంతి చెప్పారు. మాజీ కలెక్టర్ ఆమోయ్ కుమార్ కూడా తనను పిలిచి ఉన్నత కులం వారితో తక్కువ కులం వారు పెట్టుకోవద్దని అన్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. సెలవు పెట్టకపోతే తనను సస్పెండ్ చేస్తానని రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ బెదిరించారని ఆమె తెలిపారు.
మున్సిపల్ ఛైర్‌పర్సన్ స్రవంతి ఫిర్యాదు మేరకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఆమోయ్ కుమార్, ఇబ్రహీంపట్నం మాజీ మున్సిపల్ కమిషనర్ ఎండీ యూసఫ్ పై ఎస్సీ ఎస్టీ 504, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మున్సిపల్ ఛైర్‌పర్సన్ కప్పరి స్రవంతి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు.












Click it and Unblock the Notifications