నిత్య పెళ్లి కూతురు... లేడీ కానిస్టేబుల్ మోసాలు..? రక్షించాలంటూ పోలీసులకు నాలుగో భర్త ఫిర్యాదు...
నిత్య పెళ్లి కూతురిగా మారి యువకులను మోసం చేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ లేడీ కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. ఇప్పటివరకూ ఆమె నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందులో ఇద్దరికి విడాకులు ఇవ్వగా ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నాలుగో భర్త తాజాగా పోలీసులను ఆశ్రయించి ఆమె వేధింపుల నుంచి తనను కాపాడాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితురాలి ఆగడాలపై గతంలో ఆమె తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఎవరా కానిస్టేబుల్...
హైదరాబాద్‌కి చెందిన ఏఆర్ మహిళా కానిస్టేబుల్ సంధ్యారాణి నగరంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఉంటోంది. చేస్తున్నది పోలీస్ ఉద్యోగమైనప్పటికీ ప్రేమ,పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. గతంలో సంధ్యారాణి మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరికి విడాకులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరొకరు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు సమాచారం. సంధ్యారాణికి 8 ఏళ్ల పాప కూడా ఉంది. కొన్నాళ్ల క్రితం చరణ్ అనే మరో యువకుడిని సంధ్యారాణి ట్రాప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నది.

ఇలా వెలుగులోకి...
తాజాగా రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రానికి చెందిన చరణ్ తేజ అనే యువకుడు సంధ్యారాణి తనను మోసం చేసిందని,వేధింపులకు గురిచేస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను రక్షించాలంటూ శంషాబాద్ డీసీపీ,షాబాద్ పోలీస్ స్టేషన్‌లను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న తనను ఆమె ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అతను పేర్కొన్నాడు. పెళ్లి చేసుకోకపోతే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతానని ఆమె బెదిరించినట్లు ఆరోపించాడు.

ఆ విషయం దాచి పెళ్లి చేసుకుందని...
పెళ్లి తర్వాత సంధ్యారాణి నుంచి తనకు వేధింపులు మొదలయ్యాయని.. తనను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజిందని చరణ్ తేజ ఆరోపించాడు. తనను గదిలో బంధించి వేధింపులకు పాల్పడిందన్నాడు. గతంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయాన్ని ఆమె తన వద్ద దాచిపెట్టినట్లు చెప్పాడు. తనను మోసం చేసిన సంధ్యారాణిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. అతని ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో సంధ్యారాణి తల్లిదండ్రులే స్వయంగా జూబ్లీహిల్స్ పోలీసులకు ఆమెపై ఫిర్యాదు చేశారన్న ప్రచారం ఉంది. పోలీస్ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని ఆమె చెడు తిరుగుళ్లు తిరుగుతోందని ఆమెపై వారు ఫిర్యాదు చేసినట్లు కథనాలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications