బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు.. కారణం ఏంటంటే!!
నిత్యం అధికార టీఆర్ఎస్ పార్టీ పై విమర్శలు గుప్పించే బీజేపీ ఫైర్ బ్రాండ్ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను దూషించి, నిర్బంధించారని గణపతి షుగర్స్ జిఎం ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే రఘునందన్ రావు పై కేసు నమోదైనట్లు గా తెలుస్తుంది.

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు
సంగారెడ్డి సమీపంలోని గణపతి షుగర్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యూనియన్ అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పై సంగారెడ్డి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ ఎస్. సీ .ఝా ఫిర్యాదుతో ఎమ్మెల్యేతోపాటు, యూనియన్ నాయకులు శ్రీశైలం, రాములు తదితరులపై కేసులు పెట్టారు. గత నెల 19వ తేదీన కార్ ఫ్యాక్టరీ కి వచ్చిన రఘునందన్ రావు అక్కడ హెచ్ ఆర్ గోవిందరావు, జనరల్ మేనేజర్ ఝా లను దూషించారని, వారిని గదిలో బంధించారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

గణపతి షుగర్స్ జీఎంను దూషించి, బెదిరించారన్న ఆరోపణలు
గదిలో బంధించి గోవిందరావుతో బలవంతంగా రాజీనామా చేయించి ఆ లేఖను వాట్సాప్ లో సంస్థ చైర్మన్ కు పంపించి ఆమోదించాలని ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకు వచ్చారని వారు ఫిర్యాదు చేశారు. ఇక తమని దూషించిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గణపతి షుగర్స్ జనరల్ మేనేజర్ ఎస్. సి. ఝా మే 28వ తేదీన సంగారెడ్డి ఎస్పీ కి లేఖ రాశారు.
ఇక ఎస్పీ ఆదేశాలతో సంగారెడ్డి రూరల్ పోలీసులు ఎమ్మెల్యే రఘునందన్ రావు పై కేసు నమోదు చేశారు. మరి తనపై వచ్చిన ఆరోపణలపై, గణపతి షుగర్స్ జనరల్ మేనేజర్ చేసిన ఫిర్యాదుపై రఘునందన్ రావు ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

గతంలోనూ రఘునందన్ రావుపై కేసుల నమోదు
గతంలోనూ అనేకమార్లు రఘునందన్ రావుపై కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలో పోలీసులు విధులకు ఆటంకం కల్పించారని ఆరోపణలతో ఎమ్మెల్యే రఘునందన్ రావు పై పోలీసులు కేసు నమోదు చేసి రాత్రి సమయంలో ఆయనను అరెస్టు చేశారు. దుబ్బాక నియోజకవర్గ పరిధిలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు ను టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డగించే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో పోలీసులపై సీరియస్ అయిన రఘునందన్ రావు తనకు పోలీసులు రక్షణ కల్పించటం లేదంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే రఘునందన్ రావు పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications