శుభవార్త.. హైదరాబాద్ నుండి తిరుపతికి దూరం తగ్గించే ఆ జాతీయరహదారి పనుల్లో దూకుడు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జాతీయ రహదారుల పనులను కేంద్రం పరుగులు పెట్టిస్తోంది. జాతీయ రహదారి 167 కే పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. డిసెంబర్ నెల ప్రధమార్ధంలో కల్వకుర్తి, జమ్మలమడుగు మధ్య జాతీయ రహదారి నిర్మాణం కోసం సేకరించిన భూమికి సంబంధించి రైతులకు నష్టపరిహారాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించారు.
జాతీయ రహదారి 167 కే పనులు.. భూసేకరణ
నంద్యాల జిల్లా మీదుగా ఈ హైవే నిర్మాణం చేపడుతున్నారు. ఈ నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా ప్యాకేజీ వన్ కింద 123 కిలోమీటర్ల పొడవు హైవే నిర్మాణం కోసం 468ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. కోవెలకుంట్ల మండలం లో 195 ఎకరాలు, ఉయ్యాలవాడ మండలంలో 84 ఎకరాలు, సంజామల మండలంలో 76ఎకరాలు, గోస్పాడు మండలంలో 93 ఎకరాలు, దొర్నిపాడు మండలంలో 75 ఎకరాలు, నంద్యాల మండలంలో 15 ఎకరాలను భూసేకరణ చేస్తున్నారు.

కల్వకుర్తి దగ్గర ఇప్పటికే పనులలో వేగం
మొత్తం జిల్లాలోని 10 మండలాలలో ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. ఇక ఇందులో భాగంగా సంగమేశ్వరం - నంద్యాల రహదారికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 776.17 కోట్ల రూపాయలను మంజూరు చేసింది .అయితే ఈ నిధులతో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి దగ్గర ఇప్పటికే పనులు వేగంగా జరుగుతున్న పరిస్థితి ఉంది.
ప్యాకేజ్ 4, ప్యాకేజ్ 2లలో భూసేకరణ
కాగా ప్యాకేజీ ఫోర్ కింద 62.5 కిలోమీటర్లకు సంబంధించి నంద్యాల మండలంలో 97 ఎకరాలు, కొత్తపల్లి మండలంలో 290 ఎకరాలు, బండి ఆత్మకూరు మండలంలో 165 ఎకరాలు, ఆత్మకూరు మండలంలో 55 ఎకరాలు, వెలుగోడు మండలంలో 11 ఎకరాలను సేకరిస్తున్నారు. మరోవైపు ప్యాకేజీ టు కింద సంగమేశ్వరంలో మాత్రమే భూసేకరణ చేస్తున్నారు వెలుగోడు ఆత్మకూరు మధ్య భూమిని సేకరించనున్నారు.
తిరుపతికి దూరం తగ్గేలా నేషనల్ హైవే పనులు
అయితే ఈ జాతీయ రహదారి 167 కే నిర్మాణంతో హైదరాబాద్ నుంచి తిరుపతికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వారు ప్రస్తుతం కర్నూలు మీదుగా వెళుతుండగా నేషనల్ హైవే 167 కే పూర్తయితే నంద్యాల మీదుగా వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడు తిరుపతికి 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఏదేమైనా జాతీయ రహదారి 167 కే పనులలో వేగం పెంచి కేంద్రం దూకుడు చూపిస్తుంది.












Click it and Unblock the Notifications