ఏపీ, తెలంగాణ రైలు ప్రయాణీకులకు మోదీ మరో వరం..!!
తెలుగు రాష్ట్రాల కోసం కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రైల్వే మౌలిక వసతుల పెంపు పైన కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. వందేభారత్ సహా పలు రైళ్ల కేటాయింపులోనూ ప్రాధాన్యత ఇస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ అనేక స్టేషన్లను ఆధునీకరించింది. కొత్తగా వందేభారత్ స్లీపర్ కేటాయింపు పైన ప్రతిపాదనలు స్వీకరించింది. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య అనుసంధానం కోసం మరో కొత్త రైల్వే లైన్ నిర్మాణం కోసం నిధులు విడుదల చేస్తూ కేంద్రం తాజాగా ఆదేశాలు ఇచ్చింది.

కేంద్రం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైన నల్లపాడు-బీబీనగర్ (పగిడిపల్లి) రెండో రైల్వే లైను నిర్మాణానికి ఈ ఏడాది (2025-26)కి 452.36 కోట్ల రూపాయలు కేటాయించింది. ఎంతో కాలంగా ఈ లైన్ నిర్మాణం కోసం వేచి చూస్తుండగా.. ఇప్పుడు నిధుల కేటాయింపుతో పనులు వేగం పుంజుకునే అవకాశం ఉంది. పనులు పూర్తి చేసేందుకు అయిదేళ్ల కాల పరిమితిని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. విష్ణుపురం-కుక్కడం మధ్య 55 కిలో మీటర్లు, కుక్కడం-వొలిగొండ మధ్య 75 కిలో మీటర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండో దశలో నల్లపాడు-బెల్లంకొండ మధ్య 56 కిలో మీటర్ల పనులకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు ఈ లైన్ కీలకంగా మారుతోంది. పెరుగుతున్న రైళ్ల సంఖ్యకు అనుగుణం గా రెండో లైన్ అవసరాన్ని ఇప్పటికే ఎంపీలు రైల్వే శాఖకు వివరించారు. ఇప్పుడు నిధుల కేటా యింపు తో రెండో రైల్వే లైను నిర్మాణం, విద్యుదీకరణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ మార్గాన్ని మొత్తం 6 దశల్లో పూర్తి చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణ యం తీసుకున్నారు. రు. 10 మేజర్, 259 మైనర్ వంతెనల నిర్మించనున్నారు. ఈ మార్గంలో వచ్చే డిసెంబర్ కు కనీసం 30 కిలో మీటర్ల మార్గం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా ఖరారు చేసారు. రైల్వేలైను నిర్మాణానికి మొత్తం 200 హెక్టార్ల భూమి అవసరమని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. ఇందులో ఏపీ పరిధిలో 135 హెక్టార్లు కాగా, మిగిలింది తెలంగాణలో సేకరిస్తున్నారు.
ప్రయాణికుల రద్దీ, అవసరాల దృష్ట్యా ఈ మార్గాన రెండో రైల్వే లైను నిర్మాణానికి కేంద్రం అనుమతించింది. ఈ మార్గంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో పాటు సికింద్రాబాద్ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు రాకపోకలు సాగించేందుకు ఇది కీలకమార్గం కావడంతో ఈ లైను పనులను ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే రైలులో గుంటూరు నుంచి సికింద్రాబాద్ కేవలం 3 గంటల్లోనే చేరుకోనేలా వెసులుబాటు కలగనుంది.












Click it and Unblock the Notifications