బీజేపీ నేతలకి 9పదవులు! తెలంగాణకు కొత్త గవర్నర్
న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తొమ్మిది పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్‌ను నియమించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు కూడా కొత్త గవర్నర్ వస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్‌గా నరసింహన్ ఉన్నారు.
రెండు రాష్ట్రాలకు నరసింహన్ ఉన్న నేపథ్యంలో.. నరసింహన్‌ను ఏపీకి కేటాయించి, తెలంగాణకు కొత్త గవర్నర్‌ను నియమించనునన్నారని తెలుస్తోంది. మొత్తం తొమ్మిది రాష్ట్రాలకు గవర్నర్లను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం కొందరు గవర్నర్లు రెండు లేదా మూడు రాష్ట్రాల బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఈ నేపథ్యంలో త్వరలో కొత్తగా నియమించవచ్చునని అధికారులు చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అసోం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, మణిపూర్, బీహార్, పాండిచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం), పంజాబ్, తెలంగాణ, త్రిపుర రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించనున్నారని తెలుస్తోంది. ఇందులో మొదటి ఐదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. బీహార్‌లో జేడీయు, తెలంగాణలో తెరాస అధికారంలో ఉన్నాయి. త్రిపురలో లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉంది.
పుదుచ్చేరి బాధ్యతలను అండమాన్ నికోబర్ లెఫ్టినెంట్ గవర్నర్ అజయ్ కుమార్ సింగ్ నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరి నాథ్ త్రిపాఠి బీహార్, మేఘాలయ, నిజోరామ్ బాధ్యతలను, నాగాలాండ్ గవర్నర్ పద్మనాభాచారి అసోం, త్రిపుర బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
హర్యానా గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి పంజాబ్, చంఢీగర్ బాధ్యతలు, రాజస్తాన్ గవర్నర్ కళ్యాణ్ సింగ్ హిమాచల్ ప్రదేశ్ బాధ్యతలు స్వీకరించారు.
ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా ఉన్న నరసింహన్... విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదకొండు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. ఇప్పుడు కొత్తగా మరికొన్ని రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేతలకు పదవులు వస్తాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications