ఆంధ్రలో ఫిరాయింపులు: రేవంత్ రెడ్డిని దెబ్బ తీసిన చంద్రబాబు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, టిడిఎల్పీ నేత రేవంత్ రెడ్డి తలపెట్టిన పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి చర్యతో విఘాతం కలిగింది. రేవంత్ రెడ్డి వద్ద ఒకే ఒక్క రాజకీయాస్త్రం ఇప్పుడు మొక్కబోయినట్లు అయింది. తమ పార్టీ శాసనసభ్యులు కెసిఆర్ టిఆర్ఎస్‌లో చేర్చుకోవడంపై రేవంత్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తతూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై రేవంత్ రెడ్డి గొంతు మూగబోయే పరిస్థితి ఏర్పడింది. ఫిరాయింపులపై రేవంత్ రెడ్డి గొంతు ఎత్తితే ఎపిలో చంద్రబాబు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను టిడిపిలో చేర్చుకున్న విషయాన్ని ఎత్తి అధికార టిఆర్ఎస్ ఇరకాటంలో పెట్టే పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటికే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో తనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించి మరీ ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. తెలంగాణలో కెసిఆర్ ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులపై రేవంత్ రెడ్డి గానీ ఇతర టిడిపి నాయకులు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే భారాన్ని భుజాలకు ఎత్తుకున్న రేవంత్ రెడ్డికి ఇది చిక్కు సమస్యనే తెచ్చిపెట్టింది.
తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణే అయినప్పటికీ అంతా రేవంత్ రెడ్డి తన భుజాల మీదికి ఎత్తుకున్నారు. ఒక రకంగా తెలంగాణ టిడిపిలో అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కెసిఆర్‌పై తెలంగాణలో యుద్ధం చేసే చిచ్చరపిడుగుగా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఈ స్థితిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు, ఓ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపిలో చేరడం తెలంగాణలో టిడిపిపై ప్రభావం చూపుతుంది.
తెరాస ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులపై అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎదురు దాడి ప్రారంభమయ్యే పరిస్థితిని చంద్రబాబు కల్పించారు. కాగా, తాము చేసిన ఫిర్యాదులపై తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి చర్యలు తీసుకోకపోవడంపై శాసనసభలో మాట్లాడే అవకాశం కూడా రేవంత్ రెడ్డికి, ఇతర టిడిపి ఎమ్మెల్యేలకు ఉండకపోవచ్చు. మొత్తం మీద, తెలంగాణలో టిడిపి మరింతగా దెబ్బ తినే పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications