తెలంగాణకొస్తే వెళ్లబుద్ది కావట్లేదు కానీ, ఏపీ గుర్తుకొచ్చి: బాబు, జవాబు చెప్పాలని రేవంత్
ఇక్కడకు వచ్చినప్పుడు మీరు చూపుతున్న అభిమానం చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తోందని, కానీ ఏపీలో బాధ్యత గుర్తుకు వచ్చి వెళ్లక తప్పడం లేదని ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు.
హైదరాబాద్: ఇక్కడకు వచ్చినప్పుడు మీరు చూపుతున్న అభిమానం చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తోందని, కానీ ఏపీలో బాధ్యత గుర్తుకు వచ్చి వెళ్లక తప్పడం లేదని ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం అన్నారు.
చంద్రబాబు తెలంగాణలో పార్టీ వ్యవహారాల పైన దృష్టి సారించారు. ఎనిమిది నెలల తర్వాత ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టిడిపి నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణ అంశాలపై చర్చించారు. తెలంగాణ టిడిపి నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.

మోడీ నిరూపించారు
తెలంగాణ వచ్చినప్పుడు మీరు చూపుతున్న అభిమానం చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుందన్నారు. టిడిపి తెలుగు వారి కోసం స్థాపించిన పార్టీ అన్నారు. తెలంగాణలో పార్టీకి బలమైన పునాదులున్నాయన్నారు. మంచి నాయకత్వం ఉంటే ఎన్నికల్లో చక్కని ఫలితాలు వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ నిరూపించారన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పై పూర్థి స్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశం మోడీ నాయకత్వం వల్లే సాధ్యమైందన్నారు. అందుకే కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టపర్చాలని సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ... సమన్వయంతో పార్టీని బలోపేతం చేయాలన్నారు.
మీ పోరాటం నాకు ఎప్పటికప్పుడు తెలుస్తోంది
ప్రజా సమస్యలపై తెలంగాణ నేతలు చేస్తున్న పోరాటాల సమాచారం తనకు ఎప్పటికప్పుడు వస్తోందని చెప్పారు. రెండేళ్లలో చాలా సమస్యలు వచ్చాయని, ఏపీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోందన్నారు.
రేవంత్ రెడ్డి ఆగ్రహం
ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన ఘనంత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఖరీదైన నూతన భవనాల్లోకి చేరుకున్న కేసీఆర్ పేదల కష్టాలను, వారికి ఇచ్చిన హామీలను మర్చిపోతున్నారన్నారు. టిడిపిని 2019లో అధికారంలోకి వస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు.
తెరాస ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లయినా రైతు రుణమాఫీ కాలేదన్నారు. పేదవాడికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని, దలితులకు మూడెకరాల భూమి పంచలేదని ధ్వజమెత్తారు. వీటన్నింటికి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. జనం ఇబ్బందులు పడుతున్నా కేసీఆర్ పట్టించుకోవడంలేదని అధ్యక్షులు ఎల్ రమణ విమర్శించారు.












Click it and Unblock the Notifications