'చంద్రబాబు పైసలు తెలంగాణ రాష్ట్రంలో చెల్లవు'
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాపిస్టి డబ్బులు తెలంగాణ రాష్ట్రంలో చెల్లవని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ బీసీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు ఆంజనేయగౌడ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పైసలను తెలంగాణ ప్రజలు పాకిస్ధానీ కరెన్సీతో సమానంగా చూస్తున్నారని అన్నారు.
చంద్రబాబు తన అక్రమ సంపాదనతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఓడించలేరన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ టీబీసీ ఫోరం, తెలంగాణ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆంజనేయగౌడ్ శనివారం ఆవిష్కరించిన సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో పెట్టుబడిదారుల పార్టీల ఆటలు సాగవన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలువడం తథ్యమని, దానిని ఎవరూ ఆపలేరన్నారు. త్వరలోనే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో శనివారం ప్రకటించారని, వయోపరిమితిని అవసరమైతే పదేళ్లైనా సడలిస్తామని ఇచ్చిన హామీని గుర్తుచేశారు. ఇది నిరుద్యోగులకు మంచి శుభవార్తగా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications