హైద్రాబాద్‌పై మాట్లాడే హక్కు మాకే, కెసిఆర్ కూడా వచ్చేవారు: బాబు
హైదరాబాద్: హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉందని, ఈ నగరాన్ని అంతర్జాతీయస్థాయికి తీసుకు వెళ్లిన ఘనత టిడిపిదేనని, హైదరాబాదుకు టిఆర్ఎస్ ఏం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు.
హైదరాబాదులో నగరంలో ఏం జరిగినా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని చంద్రబాబు చెప్పారు. ఇతర పార్టీలు వేటికీ మాట్లాడే హక్కు లేదన్నారు. హైదరాబాదులో రాత్రిపూట రోడ్లు ఊడ్చే విధానాన్ని తానే ప్రవేశ పెట్టానని చెప్పారు.

ప్రజలు లేచి రోడ్ల పైకి వచ్చేసరికి శుభ్రంగా ఉండేవన్నారు. హైదరాబాదులో సైబరాబాద్ పేరుతో కొత్త నగరమే నిర్మించామన్నారు. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు తెచ్చామని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టు అన్నీ ఆ కాలంలో మనం రూపుదిద్దుకున్నవే అన్నారు. హైదరాబాదుకు మనం చేసినవి ప్రజల్లోకి వెళ్లి గర్వంగా చెప్పుకోవాలన్నారు.
తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఉదయాన్నే లేచే అలవాటు ఎన్టీఆర్ నేర్పారన్న వ్యాఖ్యల పైన కూడా ఆయన వివరణ ఇచ్చారు. వీటిపై తెలంగాణ సిఎం కెసిఆర్ మండిపడిన విషయం తెలిసిందే.
దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ... తాను అన్నదాంట్లో తప్పేముందని, ఎన్టీఆర్ తెల్లవారుజామున మూడు గంటలకు లేచేవారని, ఆయనను కలుసుకోవడానికి మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఉదయం ఐదు గంటలకే రావాల్సి వచ్చేదన్నారు. అది ఎన్టీఆర్‌తోనే మొదలైందన్నారు.
అప్పట్లో కెసిఆర్ కూడా అదే సమయానికి వచ్చేవారన్నారు. ఇప్పుడు ఆన తన దినచర్యను ఎప్పుడు మొదలు పెడుతున్నారో, ఆ పార్టీ వారికే తెలుసునని, తెలంగాణలోపక్కా ఇళ్ల నిర్మాణం ఎన్టీఆర్‌తోనే మొదలైందన్నారు. రూ.2 బియ్యంతో ఆహార భద్రత కల్పించారన్నారు. ఆయన చేసిన మంచిని చెప్పుకునేందుకు భయమెందుకని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications