తెలంగాణ హైకోర్టుకు కొత్త జడ్జి..!!
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తి అపాయింట్ అయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారసును ఆమోదించడం లాంఛనప్రాయమే. తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిని నియమించిన కొద్దిరోజుల్లోనే కొలీజియం ఈ తాజా నిర్ణయం తీసుకుంది.
ఆయన పేరు జస్టిస్ పీ సామ్ కోషి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తోన్నారు. ఆయనను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది కొలీజియం. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేసింది. సాధారణంగా కొలీజియం పంపించిన సిఫారసులను కేంద్రం యధాతథంగా ఆమోదించడం ఆనవాయితీగా వస్తోన్న నేపథ్యంలో- జస్టిస్ పీ సామ్ కోషి బదిలీ లాంఛనప్రాయమే కావొచ్చు.

సుప్రీంకోర్టు కొలీజియానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యాన్ని వహిస్తోన్నారు. ఆయనతో పాటు జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఇందులో సభ్యులు. మధ్యప్రదేశ్ మినహా మరే ఇతర రాష్ట్రానికి చెందిన హైకోర్టుకయినా బదిలీ చేయాలంటూ ఈ నెల 5వ తేదీన జస్టిస్ సామ్ కోషి.. సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు.
దీన్ని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు కొలీజియం.. ఆయన బదిలీకి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించింది. కేంద్రానికి సిఫారసు చేసింది. ఇటీవలే ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను నియమించాలంటూ కొలీజియం నిర్ణయించిన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరధే, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్లను సిఫారసు చేసింది.












Click it and Unblock the Notifications