వరద నీటిలో కొట్టుకుపోయిన పౌల్ట్రీ ఫామ్ కోళ్లు... తీసుకునేందుకు ఎగబడ్డ జనం...
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్,సిరిసిల్ల,జగిత్యాల,హుజురాబాద్‌లలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.కొన్నిచోట్ల ఇళ్ల ముందు పార్క్ చేసిన కార్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. తాజాగా నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లిలో వరద నీటిలో కోళ్లు కొట్టుకొచ్చాయి. దీంతో స్థానికులు ఆ కోళ్ల కోసం ఎగబడ్డారు.
భారీ వర్షాలకు జక్రాన్‌పల్లి మండలం చింతలూరులో చెరువు అలుగు పారుతోంది. ఆ వరద ఉధృతికి సమీపంలోని పౌల్ట్రీ ఫామ్ మునిగిపోయింది. దీంతో ఫామ్‌లోని కోళ్లన్నీ వరద నీటిలో కొట్టుకొచ్చాయి. విషయం గ్రామస్తులకు తెలియడంతో వరదలో కొట్టుకుపోతున్న కోళ్ల కోసం ఎగబడ్డారు. భారీగా అక్కడికి చేరుకున్న గ్రామస్తులు.. ఒక్కొక్కరు రెండు,మూడు కోళ్లను తీసుకెళ్లారు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉచితంగా కోళ్లు దొరకడంతో గ్రామస్తుల్లో సంతోషం నెలకొనగా.. సదరు పౌల్ట్రీ యజమానికి రూ.10లక్షలు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.
భారీ వర్షాల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతుండటంతో.. ఎక్కడా ప్రజలకు అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల వల్ల గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ప్రభావితమయ్యే విద్యుత్తు, రోడ్లు, నాళాలు తదితర వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్ శాఖల అధికారులు కింది స్థాయి వరకు ఉద్యోగులంతా అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
భారీ వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బలగాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకునేందుకు ప్రజా ప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎడతెగని వర్షాల నేపథ్యంలో ప్రజల ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.
రాష్ట్రంలో మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.9 జిల్లాలకు ఆరెంజ్, మరో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications