ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ఉద్వేగ ప్రసంగం.. సంచలన ప్రకటన!!
తెలంగాణ రాష్ట్ర రెండవ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి తొలి ప్రసంగాన్ని ఎల్బీ స్టేడియం వేదికగా ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి జై సోనియమ్మ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తన ప్రసంగంలో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
ప్రగతి భవన్ ఇనుప కంచెలను బద్దలు కొట్టామని, రాష్ట్ర ప్రజలు ఎప్పుడైనా ప్రగతి భవన్ కు రావచ్చని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఈరోజు స్వేచ్ఛ లభించింది అని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వంలో ప్రజలు భాగస్వాములుగా ఉంటారన్నారు.

తెలంగాణను అభివృద్ధి, సంక్షేమ రాజ్యంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని పేర్కొన్న రేవంత్ రెడ్డి, రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ తెలంగాణా రాష్ట్రం పోరాటాలతో త్యాగాల పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రం అన్నారు.
ఎన్నో ఆకాంక్షలను, ఎన్నో ఆలోచలనలను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సోనియా గాంధీ ఉక్కు సంకల్పంతో , కాంగ్రెస్ పార్టీ సమిధగా మారి ఏర్పరిచిన రాష్ట్రం తెలంగాణా రాష్ట్రం అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తాను కృషి చేస్తానని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని, తాము పాలకులము కాదు సేవకులమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
దశాబ్ద కాలంగా తెలంగాణలో ప్రజాస్వామ్యం హక్త్యకు గురై, మానవ హక్కులకు భంగం ఏర్పడి, ప్రజల కష్టాలు వినేవారు లేక ఈ దశాబ్ద కాలంగా మౌనంగా భరించిన నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలు ఈరోజు ప్రజా రాజ్యాన్ని, ప్రజల పరిపాలనను తీసుకువచ్చారన్నారు. అమరుల ఆకాంక్షలు నెరవేర్చటానికి ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటుకు నేడు కాంగ్రెస్ పార్టీ ప్రతిన బూనిందని అన్నారు.
తెలంగాణా రైతుల, నిరుద్యోగుల, ఉద్యమకారుల ప్రజల ఆకాంక్షలు నేరవేరుస్తామన్నారు. ఈ మంత్రి వర్గంతో తెలంగాణా ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో నలమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుందని అన్నారు. తెలంగాణా ప్రజల హక్కులను కాపాడేందుకు, అభివృద్ధి కోసం, శాంతి భద్రతలను కాపాడటం కోసం పని చేస్తామన్నారు.
నిస్సహాయులకు సహాయంగా ఉంటూ మీ సోదరుడిగా, మీ బిడ్డగా మీ అందరి బాధ్యత నేను తీసుకుంటా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో సోనియమ్మ అండతో, మల్లికార్జున ఖర్గే మార్గ నిర్దేశంలో, రాహుల్ గాంధీ సూచనలతో తెలంగాణా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications