చిరంజీవిని చూడగానే కలెక్షన్ల గురించి అడిగిన దాసరి, హెల్త్ బులెటిన్
కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి శుక్రవారం నాడు కిమ్స్ ఆసుపత్రిలో మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావును కలిశారు. అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవి శుక్రవారం నాడు కిమ్స్ ఆసుపత్రిలో మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావును కలిశారు. అనంతరం చిరంజీవి విలేకరులతో మాట్లాడారు. దాసరి క్లిష్ట పరిస్థితుల్లోను తన సినిమా కలెక్షన్ల గురించి అడిగారన్నారు.
దాసరి త్వరగా కోలుకుని నాలుగు రోజుల్లోనే ఇంటికి తిరిగి వస్తారన్నారు. దాసరి మాట్లాడే స్థితిలో లేకపోయినప్పటికీ పెన్నుతో పేపర్‌పై రాసి అన్ని వివరాలు తెలియజేస్తున్నారని చెప్పారు.
ఆసుపత్రిలో ఉన్న ఇలాంటి సమయంలోను తనను చూడగానే ఖైదీ నెంబర్ 150 కలెక్షన్ గురించి అడగడం అనందంగా ఉందన్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమా రూ.150 కోట్లకు దాటిందని చెప్పగా రూ.250కోట్లు దాటాలని దాసరి ఆకాంక్షించారన్నారు. దాసరి మానసిక స్థైర్యమే ఆయన్ను మళ్లీ కోలుకునేలా చేసిందని చెప్పారు. దాసరి విల్ బ్యాక్ అన్నారు.

భగంవతుని ఆశీస్సులతో కోలుకుంటున్నారు: మురళీ మోహన్
ప్రజల దీవెనలు, భగంవతుడి ఆశీస్సులతో దాసరి కోలుకుంటున్నారని మురళీ మోహన్ అన్నారు. త్వరలో ఆయనను జనరల్ వార్డుకు తరలిస్తారని చెప్పారు. ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.
అద్భుతమైన ఆసుపత్రిలో, అద్భుతమైన డాక్టర్లు ఉన్నారని, దాసరి బతికి బయటపడ్డారని మోహన్ బాబు అన్నారు. దాసరి బిడ్డగా తాను వారికి థ్యాంక్స్ చెబుతున్నానని అన్నారు.
దాసరిని పరామర్శించిన వారిలో చిరంజీవి, అల్లు అరవింద్, వివి వినాయక్, మోహన్ బాబు, జయప్రద, జయసుధ, అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు తదితరులు ఉన్నారు.
హెల్త్ బులెటిన్
దాసరి ఆరోగ్య పరిస్థతిపై కిమ్స్ వైద్యులు శుక్రవారం సాయంత్రం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. దాసరి అరోగ్యం నిలకడగానే ఉందని , నాలుగు రోజులతో పోల్చితే ఇవాళ మరింత మెరుగుపడిందన్నారు.
ఊపిరితిత్తుల పనితీరు కూడా నిలకడగానే ఉందని డయాలిసిస్ కూడా తీసివేశామని చెప్పారు. దాసరి గొంతుకు ట్రెక్టామి ఆపరేషన్ చేయడం వల్ల తాత్కాలికంగా మాట్లాడలేకపోతున్నారన్నారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని, మరో నాలుగు రోజులపాటు దాసరిని ఐసీయూలోనే ఉంచుతామన్నారు.












Click it and Unblock the Notifications