హైదరాబాద్ బిచ్చగాళ్లంతా ఇక అక్కడికే?: కనిపించకుండా చర్యలు, ప్రతీది గమనిస్తారనే!
Recommended Video

హైదరాబాద్: అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో, అప్పటి అమెరికా అధ్యక్షుడు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఏం జరిగింది?.. నగరంలోని బిచ్చగాళ్లను వెతికి వెంటాడి మరీ బలవంతంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలించేశారు.
అలాంటి సీనే ఇప్పుడు టీఆర్ఎస్ సర్కార్ మళ్లీ రిపీట్ చేయబోతోంది. ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నేపథ్యంలో నగరంలోని బిచ్చగాళ్లందరిని తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ యాచకుల నిర్మూలన చట్టం-1977 కింద ఈ నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

యాచకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు:
అయితే అప్పట్లో లాగా గాలికి వదిలేయకుండా.. వాళ్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండటం విశేషం. యాచకులందరినీ జైళ్ల శాఖ పరిధిలోని ప్రత్యేక గృహాలకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం చంచల్‌గూడ సెంట్రల్ జైలు వెనుక భాగంలో ఉన్న బాలుర అబ్జర్వేషన్ హోంను పురుష యాచకుల కోసం, దాని పక్కన ఉన్న భవనాన్ని మహిళా యాచకుల కోసం కేటాయించనున్నారు. వర్క్ హౌస్ కమ్ స్పెషల్ హౌస్‌గా దీన్ని ఉపయోగించనున్నారు.

జైళ్ల శాఖ ఆధ్వర్యంలో:
పురుష, మహిళా యాచకుల కోసం వేర్వేరుగా నిర్వహించే ఈ హోమ్‌ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం రాష్ట్ర జైళ్లశాఖకే అప్పగించింది. చంచల్‌గూడలోని స్టేట్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ వైస్ ప్రిన్స్‌పాల్‌ను పురుష యాచకుల వర్క్‌హోంకు సూపరింటెండెంట్‌గా, చర్లపల్లిలోని ఖైదీల వ్యవసాయ కాలనీ సూపరింటెండెంట్‌ను మహిళా యాచకుల వర్క్ హోంకు సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విచ్చేయనున్న ట్రంప్ కూతురు:
పెట్టుబడులు, కొత్త పరిశ్రమలే లక్ష్యంగా వచ్చే నెల 28 నుంచి 30 వరకు హెచ్‌ఐఐసీలో సదస్సు జరగనుంది. సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, పారిశ్రామికవేత్త ఇవాంకా ట్రంప్‌తో పాటు దేశ విదేశాలకు చెందిన 1,500 మంది పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వక్తలు పాల్గొననున్నారు.

ప్రతీది గమనిస్తారనే:
ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ఈ సదస్సు ప్రారంభం కానుంది. బడా కంపెనీల ప్రతినిధులు, పేరు మోసిన పారిశ్రామికవేత్తలు సదస్సుకు వస్తుండటంతో.. ఎక్కడా యాచకులు కనిపించకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే సదస్సు జరిగే మూడు రోజుల పాటే వీరిని నిర్బంధిస్తారా?.. లేక ఎన్ని రోజులు అనేదానిపై స్పష్టత లేదు. పెట్టుబడులు పెట్టేవాళ్లు ప్రతీది గమనించే అవకాశం ఉన్నందునా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications