మిచౌంగ్ తుఫాను బాధిత రైతులకు, ప్రజలకు సీఎం జగన్ భరోసా.. అధికారులకు ఆదేశాలు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాను ప్రభావం, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్ వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో సాధారణ స్థితి తీసుకురావడానికి అధికారులు దృష్టి సారించాలని సూచించారు.
బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని, ఆ పరిస్థితులలో మనమే ఉంటే ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో ఆ తరహా సహాయాన్ని బాధితులకు అందించాలన్నారు. పది రూపాయలు ఎక్కువ ఖర్చయినా పర్వాలేదు కానీ బాధితులకు మంచి సహాయం అందాలని, ఇలాంటి కష్ట సమయంలో తమను బాగా చూసుకున్నారు అనే మాట రావాలని జగన్ పేర్కొన్నారు.

ఇక రైతుల పంట నష్టాన్ని అంచనా వేయాలని, పొలాలలో వరద నీటిని పూర్తిగా తొలగించడం పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి రైతును ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
పంటల రక్షణ కోసం, తడిసిన ధాన్యాన్ని రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు సబ్సిడీపై విత్తనాల సరఫరా కు అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాలలో రవాణా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని, యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరించాలని సూచించారు.
ఇక వర్షాలు వరదల వల్ల నిరాశ్రయులైన వారు క్యాంపుల నుండి తిరిగి ఇండ్లకు వెళుతున్న వారికి తగిన సహాయం అందించాలని సూచించారు. పరిహారం అందించడం పట్ల సానుభూతితో వ్యవహరించాలని, రేషన్ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదని తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాలలో వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యం పై దృష్టి సారించాలన్నారు.
అధికారులు బాగానే పనిచేస్తున్నారని పేర్కొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి చెట్టు కూలి కానిస్టేబుల్ చనిపోయిన ఘటనలో ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడుతుందని, 30 లక్షల రూపాయల సహాయాన్ని అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల లోను ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా ప్రభుత్వం అండగా ఉంటుందని సూచించారు.












Click it and Unblock the Notifications