సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన: ఈ నెలలోనే రెండో సారి : రాజకీయ వర్గాల్లో ఆసక్తి..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 2వ తేదీన ఢిల్లీలో తెలంగాణ భవన్ భూమి పూజ కోసం వెళ్లిన కేసీఆర్ దాదాపు వారం రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేసారు. ఆ సమయంలో ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా అదే విధంగా జలశక్తి మంత్రి షెకావత్ తోనూ భేటీ అయ్యారు. ఇప్పుడు మరో సారి ఢిల్లీ పర్యటన కు సీఎం బయల్దేరుతున్నారు. శుక్రవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు అసెంబ్లీలో సంతాప తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు.
సభ వాయిదా పడిన తరువాత సమావేశాల నిర్వహణ పైన బీఏసీ సమావేవం జరగనుంది. అందులో పాల్గొన్న అనంతరం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుందని తెలిసింది. ఈనెల 25వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశం కానున్నారు. మరుసటి రోజు 26వ తేదీన విజ్జానభవన్‌లో కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో మాట్లాడనున్నారు.

అదే రోజు సాయంత్రం హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు. అయితే, కేసీఆర్ గత ఎన్నికల సమయంలో జాతీయ రాజకీయాల పైన ఆసక్తి చూపారు. కానీ, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి రావటంతో తన వ్యూహాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా పార్టీ కార్యాలయం సైతం సిద్దం చేసుకుంటున్న కేసీఆర్..భవిష్యత్ రాజకీయాల పైన ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర హోం మంత్రి సమావేశం ఆహ్వానం మేరకే ఢిల్లీ వెళ్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.
అయితే, ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో మరో సారి ఆసక్తి కర చర్చకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. గత పర్యటన సమయంలోనూ బీజేపీ - కేసీఆర్ ఒక్కటే అంటూ రేవంత్ ప్రచారం చేసారు. కానీ, బీజేపీ నేతలు దానిని తిప్పి కొట్టారు. తాజాగా తెలంగాణలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications