2014లో చేసిన బాస ఇది: పాత కెసిఆర్‌ను చూస్తారని బెదరింపులు
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి శరాఘాతంగా తాకింది.
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వానికి శరాఘాతంగా తాకింది.
కాంట్రాక్టర్ల వ్యవస్థను రూపుమాపి.. వారికి నిర్ధారిత వేతనం చెల్లిస్తూ వారి సేవలను ఉపయోగించుకోవచ్చునని.. అలాగని వారికి ప్రత్యేక హక్కులు కల్పించినట్లు కాదని.. తాము తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ముందుకెళ్లొద్దని 'విద్యుత్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ' జీవో అమలుపై న్యాయస్థానం స్టే విధించడంతో సీఎం కేసీఆర్ గంగ వెర్రులెత్తారా? అన్నట్లు వ్యవహరించారు. ఒకవైపు న్యాయస్థానం ఆదేశాలను స్వాగతిస్తూనే మరోవైపు విపక్షాలపై తిట్ల దండకం అందుకున్నారు.
ఒక ప్రభుత్వాధినేతగా అలా చేయకూడదని ఆయనకు తెలిసినా పాత కేసీఆర్‌ను చూస్తారని బెదిరింపులకు పాల్పడేందుకు వెనుకాడలేదు. ఈ పిటిషన్ల పర్వంపై చెలరేగిపోయిన సీఎం కేసీఆర్.. ఒక విషయం విస్మరిస్తున్నారు. 2014 జూన్ రెండో తేదీన తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేళ.. ఇక తెలంగాణలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగ నియామకాలే ఉండవని సగర్వంగా ప్రకటించారు. ఆ వ్యవస్థను పూర్తిగా ఎత్తేస్తామని చెప్పారు.
కానీ మూడేళ్లు దాటిన తర్వాత కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల సంఖ్య వేల మందికి చేరుకున్నది. ఇదీ బుధవారం హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన గణాంకాలే చెప్తున్నాయి. 2016 వరకు కేవలం 1145 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు టీఎస్ ట్రాన్స్ కో, టీఎస్ జెన్ కో సంస్థల్లో పనిచేస్తున్నారు. కానీ ఆ తర్వాత వేల సంఖ్యలోకి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎలా వచ్చి చేరారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

సీఎం హామీకి భిన్నంగా ఔట్ సోర్సింగ్ ఎలా సాగింది?
2016 డిసెంబర్ నాలుగో తేదీని కటాఫ్ తేదీగా ఎందుకు ప్రకటించారన్నదీ వింతగానే మిగిలింది. 2014 జూన్ రెండో తేదీ తర్వాత ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలే ఉండవని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారుగా.. అసలు వాస్తవమేమిటంటే అనధికారికంగా ప్రభుత్వంలో పెద్దలే స్వయంగా ఔట్ సోర్సింగ్ నియామకాలను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. ఒక్కో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తనకు ఉద్యోగం ఇచ్చిన వ్యక్తికి, సంస్థకు ఏటా రూ. లక్ష చెల్లించుకోవాలి మరి. దీని ప్రకారం రమారమీ 20 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి ఏటా రూ. లక్ష ఎవరి జేబుల్లోకి వెళ్లాయన్న సంగతి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో హైకోర్టు తాత్కాలిక ఉత్తర్వులతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మేలే జరిగిందని చెప్పాలి.
Recommended Video


లక్షల మంది నిరుద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకమేనా?
విలీనం పేరుతో వేలమంది పొరుగు సేవల ఉద్యోగుల్ని విద్యుత్ సంస్థల్లోకి తీసుకోవడం సరికాదని ప్రాథమికంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ విధానం దొడ్డిదారి నియామకం కిందకు వస్తుందని, ఈ చర్య నిరుద్యోగ యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న పిటీషనర్ వాదనలతో ఏకీభవించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విలీనానికి విద్యుత్ సంస్థలు జారీచేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.

ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం
విద్యుత్ సంస్థలు పెట్టిన గడువే వివాదాస్పదంగా మారింది. న్యాయస్థానంలో దాట వేత కోసం విలీనం అన్నారే గానీ ప్రభుత్వ పెద్దలు.. వాస్తవంగా అన్నీ అనుకూలిస్తే ఇష్టారాజ్యంగా చేసుకెళ్లిపోవచ్చునన్న మాట. కానీ కేవలం ఆరు నెలల క్రితం ఔట్ సోర్సింగ్ విభాగంలో చేరిన ఉద్యోగి సర్వీస్ రెగ్యులరైజ్ అయిపోతే.. ఏళ్ల తరబడి ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల కోసం ఆర్తిగా ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగం భవితవ్యమేమిటన్నది ప్రశ్నార్థంగా మారింది.

సింగరేణిలో నియామకాలపైనా ఇలా దాటవేత
న్యాయస్థానం కరాఖండీగా తేల్చేయడంతో వారి వేతనాలు పెంచుతామని ప్రకటించారు సీఎం కేసీఆర్. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడినా ఫర్వాలేదని అన్నారు. మరి ఆయన వాదన ప్రకారమే వారి ఉద్యోగాల క్రమబద్ధీకరణ వల్ల బేసిక్ వేతనం ప్లస్ ప్రతి మూడు నెలలకోసారి కరువు భత్యం,.. మిగతా ఉద్యోగుల మాదిరిగా అన్ని వసతులు కల్పించడం.. వేతన సవరణల అమలుతో ఖజానాకు మరింత భారం కాదా? అన్న అనుమానం వ్యక్తమవుతున్నది. ఇంతకుముందు సింగరేణిలో వారసత్వ ఉద్యోగ నియామకాలపైనా న్యాయస్థానం ఉత్తర్వులతో నిలిచిపోయిందని దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని సీఎం చెప్పారు. కానీ ఇప్పటికే సింగరేణిలో నియామకాలపై న్యాయస్థానం స్టే జారీ చేసి దాదాపు ఆరు నెలలు కావస్తున్నది. మరో ఆరు నెలలు దాటితే ఇక రాజకీయ రణరంగమే గానీ ఉద్యోగ నియామకాల ఊసే ఉండదు. అనునిత్యం భావోద్వేగ పూరిత వ్యాఖ్యలతో.. తెలంగాణ సెంటిమెంట్‌ను రంగరించి కాలం గడుపుకోవాలని చూస్తే సబ్బండ వర్ణాలు ప్రేక్షక పాత్ర వహించడానికి సిద్ధంగా లేవని అర్థం చేసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.












Click it and Unblock the Notifications