కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన - సీఎంగా కొనసాగుతూనే : 11న హైదరాబాద్ వేదికగా..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ ప్రకటనకు రంగం సిద్దమైంది. కొంత కాలంగా జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ పైన ప్రజాభిప్రాయం తెలుసుకొనే ప్రయత్నం చేసిన సీఎం..ఇప్పుడు రంగంలోకి దిగేందుకు నిర్ణయించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించటమే లక్ష్యంగా పని చేస్తామని ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. బీజేపిని వ్యతిరేకించే పార్టీల నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. తాజాగా, బీహార్ వెళ్లి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నితీష్ తోనూ సమావేశమయ్యారు. తమది థర్డ్ ప్రంట్ కాదని..తమదే అసలైన ఫ్రంట్ అని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో మరోసారి ప్రభుత్వ ఏర్పాటు
తెలంగాణలో వరుసగా మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు ద్వారానే జాతీయ స్థాయిలో గుర్తింపు మరింత దక్కుతుందని భావిస్తున్నారు. దీంతో..ఇప్పటి వరకు చేయించిన సర్వేల్లో తెలంగాణలో మరోసారి అధికారం ఖాయమనే అంచనాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఇక, టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా రూపాంరతం చేసేలా కార్యక్రమాలు వేగవంతం చేసారు. అందులొ భాగంగా హైదరాబాద్ కేంద్రంగానే జాతీయ పార్టీ ప్రకటనకు సీఎం కేసీఆర్ సిద్దం అవుతున్నారు. ఇప్పటికే రైతు సంఘాలతో పాటుగా మేధావి వర్గానికి చెందిన వారితోనూ కేసీఆర్ సమావేశం అయ్యారు. వారి నుంచి సూచనలు - సలహాలు స్వీకరించారు. ముందుగా జాతీయ స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్న నాన్ బీజేపీ - నాన్ కాంగ్రెస్ నేతలతో నిరంతరం టచ్ లో ఉంటూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్ కేంద్రంగా జాతీయ పార్టీ
ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ముందుగా పార్టీ ప్రకటన చేయాలని..ఆ తరువాతనే జాతీయ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నారు. ముందకొచ్చిన పార్టీల నేతలతో కలిసి పొత్తులు - ఫ్రంట్ పైన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 11వ తేదీన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి హైదరాబాద్ రానున్నారు. గతంలో బెంగళూరు వెళ్లిన కేసీఆర్ మాజీ ప్రధాని దేవగౌడ..కుమార స్వామితోనూ కేసీఆర్ సమావేశం నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న నేతలను కలుపుకొని ప్రత్యామ్నాయంగా మారాలనేది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. మారాల్సింది ప్రభుత్వాలు కాదని, విధానాలంటూ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

జాతీయ పార్టీగా టీఆర్ఎస్
ఇప్పుడు తాజాగా, పార్టీ ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ కేంద్రంగానే జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నట్లు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 11న కుమార స్వామితో భేటీ సమయంలో మరిన్ని కీలక అంశాలపైన నిర్ణయం తీసుకోనున్నారు. వచ్చే నెలలో హైదరాబాద్ కేంద్రంగా కీలక సమావేశం ఉంటుందని చెబుతున్నారు. అయితే, తాను జాతీయ రాజకీయ పార్టీ ప్రకటన.. ఢిల్లీ కేంద్రంగా కార్యాచరణలో ఉన్నా.. ముఖ్యమంత్రిగా తానే కొనసాగాలని కేసీఆర్ నిర్ణయించారు. ఎన్నికల ఫలితాల తరువాత..అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. దీంతో..రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాచరణ ఆసక్తి కరంగా మారనుంది.












Click it and Unblock the Notifications