అందుకే కడుపు మంట, నేను హెచ్చరిస్తున్నా... చిల్లరగా వద్దు: కెసిఆర్
ఖమ్మం: తాము కోటి ఎకరాలకు నీరు ఇవ్వాలని కలలు గన్నామని, దానిని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని అందుకే ప్రతిపక్షాల కడుపు మండుతోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం నాడు అన్నారు.
ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం రోళ్లపాడులో సీతారామ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వర రావు, ఎంపీ సీతారాం నాయక్, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్యతదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో 6 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 8వేల కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 24 మండలాలకు చెందిన రైతులకు సాగునీరందిస్తామన్నారు.

సమైక్య రాష్ట్రంలో గిరిజనులు ఎన్నో అవస్థలు పడ్డారన్నారు. తాను పుట్టింది తెలంగాణ ప్రజలకు న్యాయం చేసేందుకేనన్నారు. తెలంగాణ ప్రజానీకం చిరునవ్వుతో బతకాలన్న సంకల్పంతోనే ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భూనిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టిస్తామన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేని వారు అనేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే నాలుగేళ్లలో సాగునీటి రంగానికి రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. మార్చి 31 నుంచి బీసీలకు కల్యాణ లక్ష్మి పథకాన్ని వర్తింపజేయనున్నట్లు ప్రకటించారు.
భక్తరామదాసు ప్రాజెక్టును ఆరు నెలల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. తండాలన్నింటినీ గ్రామ పంచాయతీలుగా గుర్తిస్తామన్నారు. ఖమ్మం జిల్లాను అద్భుతంగా తయారు చేస్తామని చెప్పారు. జిల్లాకు రెండు పంటలకు నీరు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు.
చిల్లర రాజకీయాలు వద్దు.. హెచ్చరిస్తున్నా
తాను సన్న ముఖ్యమంత్రిని అని, విద్యార్థులకు కూడా సన్న బియ్యం అన్నం పెడుతున్నామని సీఎం కెసిఆర్ అన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా బాధ్యతతో సన్నబియ్యం అన్నం పెడుతున్నామన్నారు. సన్న బియ్యం పెడుతున్న సంగతి పిడిఎస్‌యు విద్యార్థులకు తెలియదా అని ప్రశ్నించారు.
పిడిఎస్‌యు విద్యార్థులు కెసిఆర్‌ను అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు. ఉద్యమాన్ని విజయవంతంగా నడిపినట్లే తాను ప్రభుత్వాన్ని నడుపుతున్నానని చెప్పారు. చిల్లర రాజకీయాలు చేసే వారిని తాను హెచ్చరిస్తున్నానని, పద్ధతి మార్చుకుంటే మంచిదని హితవు పలికారు.
గత ప్రభుత్వాలు పేదలకు డబ్బా ఇళ్లు కట్టిస్తే తాము డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తున్నామన్నారు. తాము ఓట్ల కోసం కాకుండా బాధ్యతతో పని చేస్తున్నామన్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో విజయం పైన కెసిఆర్ స్పందించారు. ఖేడ్ ప్రజలకు ధన్యవాదాలు అని, తాము చరిత్ర సృష్టించామన్నారు.












Click it and Unblock the Notifications