తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమావేశం: బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల.. ఎప్పుడంటే!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచారు. అన్ని పార్టీల కంటే ముందే వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్, అభ్యర్థులతో సమావేశాన్ని నిర్వహించి త్వరలోనే వారికి బీఫామ్ లు కూడా అందజేయాలని భావిస్తున్నారు.
అక్టోబర్ 15వ తేదీన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ సమావేశం నిర్వహించనున్నారు. బి ఫారాలు అభ్యర్థులకు అందజేయడంతో పాటు అదే రోజు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేయనున్నారు. మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం అదే రోజు నుంచి ప్రచార బరిలోకి దిగనున్నారు సీఎం కేసీఆర్.

వరుసగా బహిరంగ సభలలో పాల్గొని ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేయనున్నారు. 15, 16, 17, 18 తేదీలలో హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల, జడ్చర్ల, మేడ్చల్ లో ఏర్పాటుచేసే బహిరంగ సభలలో కేసీఆర్ పాల్గొంటారు. అక్టోబర్ 15వ తేదీ సాయంత్రం హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. 16వ తేదీన జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాలలో బహిరంగ సభలలో పాల్గొంటారు.
17వ తేదీన సిద్దిపేట, సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో పాల్గొంటారు. 18వ తేదీన మధ్యాహ్నం 2గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో, ఆపై సాయంత్రం 4గంటలకు మేడ్చల్ లో జరిగే బహిరంగ సభలలో కెసిఆర్ పాల్గొంటారు. అయితే ఈ క్రమంలో ఇంతకుముందు అక్టోబర్ 15న కేసీఆర్ వరంగల్ సభలో మాట్లాడతారని, ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటిస్తారని చెప్పారు. కానీ తాజా షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ వరంగల్ సభ రద్దు అయినట్టు సమాచారం.
త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో శరవేగంగా ప్రణాళిక బద్ధంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బహిరంగ సభల ద్వారా ప్రజలను ఆకర్షితులను చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లి బీఆర్ఎస్ పార్టీ అందిస్తున్న పాలనను గుర్తుచేసి మళ్లీ తమను ఆశీర్వదించాలని కేసీఆర్ కోరనున్నారు.












Click it and Unblock the Notifications