డెసిషన్ డే..! ప్రైవేటీకరణ దిశగా సర్కార్.. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ కీలక నిర్ణయం
తెలంగాణ ఆర్టీసీ వ్యవహారాన్ని తేల్చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిసైడ్ అయ్యారు. మరింత దీనిని సాగదీయకుండా..నిర్ణయం ప్రకటించేందుకు కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఆర్టీసీ భవితవ్యం.. కార్మికులకు విధుల్లోకి తీసుకోవటం పైన ముఖ్యమంత్రి ఈ సమీక్షలో నిర్ణయించనున్నారు. సమ్మె వ్యవహారం ఇప్పుడు లేబర్ కోర్టు పరిధిలోకి వెళ్లటం..ప్రైవేటీకరణ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అన్ని అంశాలను చర్చించి ఆర్టీసీపై తుది నిర్ణయం తీసు కోవాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అదే విధంగా కార్మికులు తాము సమ్మె విరమించటానికి సిద్దంగా ఉన్నామని చెబుతూ..పలువురు కార్మికులు డిపోల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దీంతో..ఈ మొత్తం వ్యవహారం పైన సమీక్షించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయం తేల్చేస్తారని తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు కార్మిక సంఘాలు ముఖ్యమంత్రి తీసుకొనే నిర్ణయం పైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారా..
ఆర్టీసీ సంబంధిత అంశాల పైన ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. నాలుగు రోజుల క్రితమే మొత్తం వ్యవహారం పైన తుది ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి భావించారు. అయితే, అప్పటికీ ప్రయివేటీకరణ అంశం పైన హైకోర్టు నుంది తుది తీర్పు కాపీ అందకపోవటంతో నిర్ణయం వాయిదా పడింది.
ఇక, కోర్టు ప్రయివేటీకరణ దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన అనుకూలం గా నిర్ణయం ప్రకటించటంతో..ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేగంగా వేస్తోంది. ఇదే సమయంలో సమ్మె ముగించేందుకు కార్మికులు ముందుకు వస్తున్న పరిస్థితుల్లో వారి విషయం పైనా ఏ రకంగా వ్యవహరించా లో ముఖ్యమంత్రి కేసీఆర్ వారికి నిర్దేశించే అవకాశం కనిపిస్తోంది.

కార్మికులు సిద్దం..ప్రభుత్వం సిద్దమా
గత వారం తాము సమ్మె విరమించటానికి సిద్దంగా ఉన్నామని కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. అయితే, ఎటువంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరింది. దీని పైన ప్రభుత్వం స్పందించలేదు. గతంలోనే ముఖ్యమంత్రి కార్మికులు తమ వైఖరి స్పష్టం చేసారు. కార్మికులు తమకు భవిష్యత్ లో యూనియన్లతో సంబంధం లేదని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చి విధుల్లో చేరవచ్చాని సూచించారు.
అయితే, అందుకు సమయం సైతం నిర్దేశించారు. కానీ, ఆ సమయంలో నామ మాత్రంగానే కార్మికులు ముందుకు వచ్చారు. ఇక, ఇప్పుడు ప్రభుత్వం నుండి స్పందన లేకపోవటంతో సమ్మె తిరిగి కొనసాగిస్తామని కార్మిక సంఘాలు చెబుతున్నా..కార్మికులు మాత్రం డిపోల ముందు తమను విధుల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు చేస్తున్నారు. దీని పైనా సీఎం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

ఆర్టీసీ యధావిధిగా ఉంటుందా..
ఆర్టీసీ సమ్మె సమయంలో ప్రభుత్వం తమ వైఖరి స్పష్టం చేస్తూ పలు రకాల వాదనలతో అఫిడవిట్లు దాఖలు చేసింది. ఆర్టీసీని నడపడానికి ప్రతి నెలా రూ. 640 కోట్లు కావాలని, ఈ మొత్తాన్ని భరించే శక్తి సంస్థకు లేదా తమకు లేదని ప్రభుత్వం చేతు లెత్తేసింది. దీన్నుంచి బయట పడేందుకు బస్సు చార్జీల పెంపు ఒకటే మార్గమని, కానీ దీనివల్ల సామాన్యులు ఇబ్బంది పడ తారని అభిప్రాయ పడింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆర్టీసీని యథా విధిగా నడపడం సాధ్యం కాదని ప్రకటించింది. ఈ పరిస్థితు లను కారణంగా చూపుతూ ఆర్టీసీ భవితవ్యంపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలకు సిద్ధమైంది. రూట్ల ప్రైవేటీకరణకు ఇప్పటికే రవాణాశాఖ ముసాయిదా విధివిధానాలను రూపొందించింది.

ముఖ్యమంత్రి తేల్చేస్తారా..
రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైన ఈ వ్యవహారం నుండి ప్రతిపక్ష పార్టీలు సైతం దాదాపు తప్పుకున్నాయి. ముఖ్యమంత్రి సైతం కార్మికుల విషయంలో సానుభూతితో వ్వవహరించాలనే వినతులు అనేక మంది నుండి వస్తున్నాయి. అదే సమయంలో కార్మిక సంఘాల నేతల్లో సైతం అభిప్రాయ బేధాలు కనిపిస్తున్నాయి.
విధుల్లో చేరేందుకు కార్మికులు ముందుకు వస్తున్నారు. దీంతో..ముఖ్యమంత్రి వీటన్నింటినీ పరిగణల లోకి తీసుకొని తాను నిర్ణయించిన విధంగా తొలుత 5100 ప్రయివేటు రూట్ల నిర్ణయాన్ని అధికారికంగా అమలు చేస్తూనే..కార్మికుల విషయంలో మాత్రం కొన్ని షరతులతో విధుల్లోకి తీసుకోవటం పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో..ముఖ్యమంత్రి తీసుకొనే నిర్ణయం ఏంటనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.












Click it and Unblock the Notifications