సిద్ధంగా ఉండండి: ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఫోన్, కాల్స్ రాని వారికి డౌటే
హైదరాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తున్నారు. నియోజకవర్గాలలో పరిస్థితులపై ఆరా తీశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎంత మెజార్టీతో గెలుస్తావని ఆయన ఎమ్మెల్యేలను అడిగారు.
అలాగే, ప్రతిపక్ష అభ్యర్థులు ఏం చేస్తున్నారని అడిగి, తెలుసుకున్నారు. పార్టీ నుంచి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామని చెప్పారు. అలాగే, వారి వారి నియోజకవర్గాల్లో తన సర్వే ఫలితాలను కేసీఆర్ ఆయా ఎమ్మెల్యేలకు చెప్పారు.

ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చునని, సిద్ధంగా ఉండాలనేది ఆ కాల్ ముఖ్య సారాంశం. సర్వశక్తులు కూడదీసుకొని సిద్ధం కావాలని, ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూసుకోవాలన్నారు. వనరులను సమీకరించుకోవాలని, పార్టీ తరఫున కూడా సహకరిస్తామన్నారు.
తెరాస నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి మాత్రమే కాదు, ఇతర పార్టీలలో గెలిచి తెరాసలోకి ఫిరాయించిన వారికి కూడా ఫోన్లు చేస్తున్నారని తెలుస్తోంది. కావాల్సిన నిధులను విడుదల చేయించుకోవాలని, అవసరమైతే మంత్రుల సహకారం తీసుకొని, మరీ అవసరమైతే తనను కలవాలని చెబుతున్నారు.
Recommended Video

గత నాలుగైదు రోజుల్లో ఆయన డెబ్బై మందికి పైగా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేశారని తెలుస్తోంది. కేసీఆర్ నుంచి ఫోన్ రాని వారందరికీ పోటీ చేసే అవకాశం అనుమానమని అంటున్నారు. దీంతో ఫోన్ కాల్ ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదనే చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications