coronavirus: 61 పాజిటివ్ కేసులు, ఒకరి మృతి, 592కి చేరిన పాజిటివ్ కేసులు, కేసీఆర్ సమీక్ష..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 61 మందికి పాజిటివ్ సోకింది. దీంతో పాజిటివ్ సోకిన వారి సంఖ్య 592 మందికి చేరింది. వీరిలో 17 మంది చనిపోయారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. సోమవారం ఒకరు చనిపోయారని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు లాక్‌డౌన్ అమలు, కరోనా నిరోధం కోసం తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.

రోజు వెయ్యి మందికి పరీక్ష..
ప్రతీ రోజు వెయ్యి మందికి పరీక్షలు నిర్వహించేలా ఆస్పత్రులను సిద్ధం చేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రోజు ఎన్ని కేసులు వచ్చినా వైద్యం అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉన్నాయని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. జీహెచ్ఎంసీపై ప్రత్యేకదృష్టి సారించాలని అధికారులకు స్పష్టంచేశారు.

17 జోన్లు..
భాగ్యనగరాన్ని జోన్లుగా విభజించి నివారణ చర్యలపై ఫోకస్ చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. ఒక్కో జోన్ యూనిటిగా పరిగణించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో యూనిట్‌కు పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, వైద్యశాఖ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తామని పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లలో మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టంచేశారు. పాజిటివ్ కేసుల ఆధారంగా రాష్ర్టం మొత్తాన్ని 246 జోన్లుగా విభించారు. హైదరాబాద్‌లోనే 126 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయి.
Recommended Video

మాస్క్ వేసుకొని మరీ..
సరిహద్దు ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైరస్‌తో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సీఎం కేసీఆర్ కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సోమవారం నిర్వహించిన సమీక్షకు సీఎం కేసీఆర్ మాస్క్ వేసుకొని వచ్చారు. అందరూ విధిగా మాస్క్ వేసుకోవాలని, శానిటైజర్‌తో చేతులను కడుక్కొవాలని కోరారు. ధాన్యం కొనుగోళ్ల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
`












Click it and Unblock the Notifications