రేపు పాలెంలో ఎమ్మెల్యే నోముల అంత్యక్రియలు.. హాజరుకానున్న సీఎం కేసీఆర్...
నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య(64) అంత్యక్రియలు గురువారం(డిసెంబర్ 3) ఆయన స్వగ్రామం పాలెంలో జరగనున్నాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.
గురువారం ఉదయం 10.50గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరి 10.55గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.11 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 11.25గంటలకు పాలెం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య పార్థివ దేహానికి నివాళులర్పించి అంత్యక్రియలు ముగిసే వరకు ఉంటారు. అనంతరం 12 గంటలకు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమై 12.30గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

నోముల నర్సింహయ్య మంగళవారం(డిసెంబర్ 1) గుండెపోటుతో హైదరాబాద్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన భౌతిక కాయాన్ని నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో భద్రపరిచారు. బుధవారం రాత్రికి అమెరికా నుంచి ఆయన చిన్న కూతురు జ్యోతి రానున్నారు. నోముల అంత్యక్రియలకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Recommended Video
వామపక్ష విద్యార్థి రాజకీయాల నుంచి ఎదిగొచ్చిన నోముల నర్సింహయ్య.. ఎంపీపీగా, ఎమ్మెల్యేగా అంచెలంచెలుగా ఎదిగారు. న్యాయవాదిగా,ఎమ్మెల్యేగా, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా సేవలందించారు. 1999, 2004లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన... 2018 ఎన్నికల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై విజయం సాధించారు. మంచి వక్తగా,వాగ్దాటి కలిగిన నేతగా బలమైన ముద్ర వేసుకున్న నోముల నర్సింహయ్య రాజకీయాలకు అతీతంగా అందరి అభిమానం చూరగొన్నారు.












Click it and Unblock the Notifications